విజయక్రాంతి ఖేల్ ప్రతినిధి: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశ ముగిసింది. ఫేవరెట్ అనుకున్న జట్లలో ఒకటి, రెండు తప్ప మిగతావన్నీ సూపర్ దశకు చేరుకున్నాయి. టోర్నీలో ఫేవరెట్లుగా భావించిన న్యూజిలాండ్, పాకిస్థాన్‌లు లీగ్ దశలోనే ఇంటిబాట పట్టడం ఆ దేశ అభిమానులకు రుచించలేదు. గతంలో మాజీ చాంపియన్ అయిన శ్రీలంక.. సంగక్కర, జయవర్దనే, దిల్షాన్ లాంటి కీలక ఆటగాళ్లు రిటైరయ్యాకా ఆ స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. తాజా ప్రపంచకప్‌లోనూ లంక తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేకపోయింది. మరి పొట్టి ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన ఈ మూడు జట్ల కథాకమీషు ఒకసారి పరిశీలిద్దాం..
పాకిస్థాన్..
టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ జట్టుకు అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. టీ20 ప్రపంచకప్పుల్లో పాక్ జట్టు ఒకసారి చాంపియన్, రెండుసార్లు రన్నరప్, మరో రెండుసార్లు సెమీఫైనలిస్ట్. టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ ఎంత బలమైన జట్టు అనేది ఈ గణాం కాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈసారి ప్రపంచకప్‌లో మాత్రం లీగ్ దశకే పరిమితమైంది. ఫేవరెట్ అనుకున్న పాకిస్థాన్ ఇలాంటి ప్రదర్శన చేయడం కొత్తేమీ కాదు. అనిశ్చితికి మారుపేరైన పాక్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. ఈ ప్రపంచకప్‌లో పసికూన అమెరికాను తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించుకుంది.
ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్‌లో ఒక దశలో గెలుపు దిశగా సాగిన పాక్ చివర్లో ఒత్తిడికి తలొగ్గి మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ రెండు ఓటములు పాక్‌ను సూపర్ దూరం చేశాయి. ఆ తర్వాత కెనడాపై భారీ విజయం సాధించినప్పటికీ ఐర్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో మాత్రం చచ్చీ చెడీ విజయాన్ని అందుకుంది. అనిశ్చితి ఆటతీరు మాత్రమే గాకుండా జట్టులో అంతర్గత విభేదాలు కూడా పాక్‌ను దెబ్బతీశాయి.
కెప్టెన్ బాబర్ ఆజమ్, షాహిన్ అఫ్రిదిల మధ్య పొసగకపోవడం.. వైస్ కెప్టెన్సీ విషయంలో రిజ్వాన్ అసంతృప్తితో రగిలిపోవడంతో జట్టుగా కలిసి ఆడలేక పాకిస్థాన్ ఓటములను కొనితెచ్చుకుందని స్వయానా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధి ఒకరు పేర్కొనడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆర్మీ ట్రైనింగ్ అంటూ నానా హంగామా చేయడం.. సరైన ప్రాక్టీస్ లేకుండానే ఆటగాళ్లు బరిలోకి దిగడం కూడా పాకిస్థాన్ నిష్క్రమణకు ప్రధాన కారణాలు.
న్యూజీలాండ్..
క్రికెట్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టుగా న్యూజీలాండ్‌కు పేరుంది. ఒక్కసారి కూడా చాంపియన్ ట్యాగ్ పొంద నప్పటికీ ఆ జట్టు తన స్థాయికి తగ్గ ఆటతీరును మాత్రం ప్రదర్శిస్తూనే వచ్చింది. ఐసీసీ టోర్నీల్లో అండర్‌డాగ్స్ ట్యాగ్‌తో బరిలోకి దిగే బ్లాక్‌క్యాప్స్ ప్రతీసారి అంచనాలకు మించి రాణించడం పరిపాటిగా మారింది. 2015 నుంచి చూసుకుంటే ఆ జట్టు ఆడిన ప్రతీ ఐసీసీ టోర్నీలో కనీసం సెమీఫైనల్ చేరడం విశేషం. ఇక టీ20 ప్రపంచకప్పుల్లోనూ కివీస్ జట్టుకు నిలకడైన ఆటతీరే ప్రామాణి కంగా ఉంది. 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనలిస్ట్‌గా నిలిచిన కివీస్ 2021లో అద్భుత ప్రదర్శన చేసింది. అయితే అప్పటి ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
2022 టీ20 ప్రపంచకప్‌లోనూ సెమీఫైనల్ చేరిన కివీస్ ఈసారి మాత్రం అనూహ్యంగా లీగ్ దశకే పరిమితమైంది. వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండా, పపువా న్యూ గినియా లాంటి జట్లు ఉన్న గ్రూప్ న్యూజిలాండ్ ఉండడంతో ఆ జట్టు సులువుగానే సూపర్ చేరుతుంది అని టోర్నీకి ముందు అంతా భావించారు. అయితే అఫ్గానిస్థాన్ చేతిలో దారుణ ఓటమి ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. నిలకడకు మారుపేరు అయినప్పటికీ ఒక్కసారి ఒత్తిడిలో పడితే కివీస్ ఆటతీరు పూర్తిగా మారిపోతుంది. అందుకు అఫ్గాన్‌తో మ్యాచ్ ఉదాహరణ. ఫిన్ అలెన్, కాన్వే, విలియమ్సన్, మిషెల్, పిలిప్స్, సాంట్నర్ లాంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్న జట్టు అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.
ఆ తర్వాత ఆతిథ్య వెస్టిండీస్ చేతిలో కూడా ఓడిన న్యూజిలాండ్ వరుసగా రెండు ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్‌ను ఓడించినంత పని చేసిన కివీస్ నుంచి టీ20 ప్రపంచకప్‌లో ఇలాంటి ప్రదర్శన చూడడం నిజంగా దురదృష్టమనే చెప్పొచ్చు. అయితే నిలకడకు మారుపేరైన న్యూజిలాండ్ వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు మరింత బలంగా తయారై తిరిగి రావాలని ఆశిద్దాం.
శ్రీలంక..
2007 నుంచి 2014 వరకు ఆడిన ఐదు టోర్నీల్లో ఒకసారి చాంపియన్, రెండుసార్లు రన్నరప్, ఒకసారి సెమీఫైనలిస్ట్, మరొకసారి సూపర్ ఇక 2016 నుంచి ప్రస్తుత ప్రపంచకప్ వరకు చూసుకుంటే మూడుసార్లు సూపర్ దశ, గ్రూప్ స్టేజ్.. ఇదీ క్లుప్తంగా శ్రీలంక ప్రదర్శన. తొలి ఐదేళ్లలో ఆ జట్టులో సంగక్కర, జయవర్దనే, దిల్షాన్, మలింగ లాంటి హేమాహేమీ క్రికెటర్లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. వారంతా రిటైరయ్యాకా జట్టు ఇప్పటివరకు కోలుకోలేకపోయింది.
తాజా ప్రపంచకప్‌లోనూ ఫేలవ ఆటతీరుతో శ్రీలంక లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసిన లంక.. రెండింటిలో ఓడగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది. హసరంగా నేతృత్వంలోని జట్టు టీ20 ప్రపంచకప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని స్పష్టంగా అర్థమయింది. ఏది మేమైనా సంచలనాలకు కేరాఫ్ అయిన టీ20 క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు. వచ్చే ప్రపంచకప్ వరకు ఈ మూడు జట్లు బలంగా తిరిగిరావాలని ఆశిద్దాం.
గతానికి భిన్నంగా ఈసారి టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. భారీ స్కోర్లు నమోదు కానప్పటికీ ఉత్కంఠకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. ఈ ప్రపంచకప్‌లో రెండు సార్లు సూపర్ ఓవర్ల ద్వారా మ్యాచ్ ఫలితాలు వస్తే .. ఇన్నింగ్స్ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లు మరెన్నో. పసికూనలనుకున్న అమెరికా, నమీబియా, స్కాట్లాండ్‌లు టోర్నీల్లో సంచలన ప్రదర్శన కనబరిచాయి. ఆతిథ్య హోదాలో అమెరికా అయితే ఏకంగా సూపర్ ప్రవేశించింది. అయితే ఈ సంచలనాల పర్వాలు కొన్ని మేటి జట్లను దెబ్బతీశాయి. ఒకప్పటి చాంపియన్లు లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.