calender_icon.png 17 November, 2024 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమోద్ భగత్‌కు షాక్

14-08-2024 12:04:49 AM

  1. 18 నెలల పాటు నిషేధం
  2. పారాలింపిక్స్‌కు దూరమైన స్టార్ షట్లర్

పారాలింపిక్స్‌కు ముందు భారత్‌కు ఊహించని షాక్ ఎదురైంది. టోక్యోలో స్వర్ణం సాధించిన పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు సంచలనం కలిగించింది. ఈసారి పారాలింపిక్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న తరుణంలో ప్రమోద్‌పై 18 నెలలు నిషేధం విధించింది. దీంతో ప్రమోద్ పారాలింపిక్స్‌లో తన టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశం కోల్పోవడం భారత అభిమానులగుండెలు పగిలేలా చేసింది.

న్యూఢిల్లీ: భారత స్టార్ పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లఘించినందుకు గానూ ప్రమోద్‌పై 18 నెలల నిషేధం విధించినట్లు మంగళవారం వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1, 2025 వరకు ప్రమోద్‌పై నిషేధం అమల్లో ఉండనుంది. దీంతో  ఈ నెల 28 నుంచి ఆరంభం కానున్న పారిస్ పారాలింపిక్స్‌కు ప్రమోద్ దూరం కానున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లో ప్రమోద్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

‘ప్రమోద్ భగత్‌ను 12 నెలల వ్యవధిలో మూడుసార్లు డోపింగ్ పరీక్ష కోసం రమ్మని కోరాం. అయినా అతడు హాజరుకాలేదు. దీనికి సంబంధించిన కారణాలను కూడా ప్రమోద్ పేర్కొనలేదు. నిబంధనలు ఉల్లఘించినందుకు గాను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (కాస్) డోపింగ్ నిరోధక విభాగం ఈ ఏడాది మార్చి 1న ప్రమోద్‌పై నిషేధం విధించింది. తనపై నిషేధాన్ని ఎత్తేయాలని ప్రమోద్ కాస్‌ను అభ్యర్థించాడు. ప్రమోద్ అభ్యర్థనను కాస్ కొట్టివేసింది. మార్చి1న డోపింగ్ నిరోధక విభాగం ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ప్రమోద్‌పై నిషేధం పడింది’ అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. 

వాడా నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. టెక్నికల్ కారణాలతో ఒకరిపై వేటు వేయడం కరెక్ట్ కాదు. రెండుసార్లు టెస్టుకు హాజరుకాలేకపోయా. కానీ మూడోసారి టెస్టుకు హాజ రైనట్లు నా వద్ద ఆధారాలున్నాయి. నా అప్పీల్‌ను వారు తిరస్కరించారు. పారాలిం పిక్స్ కు సన్నద్ధమవుతున్న తరుణంలో నిషే ధం బాధించింది. 

ప్రమోద్ భగత్, పారా షట్లర్

ఎవరీ ప్రమోద్ భగత్

బిహార్‌కు చెందిన ప్రమోద్ భగత్ ఐదేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. 13 ఏళ్ల వయసులో తొలిసారి బ్యాడ్మింటన్‌పై ఇష్టం పెంచు కున్న ప్రమోద్ 2006 నుంచి ప్రొఫెషనల్  కెరీర్‌ను ఆరంభించాడు. పురు షుల సింగిల్స్‌లో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచి చైనా దిగ్గజం లిన్ డాన్ సరసన నిలిచాడు. ఇక పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలిచిన తొలి పారా షట్లర్‌గానూ ప్రమోద్ రికార్డులకెక్కాడు.  టోక్యో పారాలింపిక్స్‌లో ప్రమోద్ ఫైనల్లో డెన్మార్క్‌కు చెందిన డేనియల్ బెథెల్‌ను ఓడించి స్వర్ణం దక్కించుకున్నాడు. ఆసియా పారా గేమ్స్‌లోనూ ప్రమోద్ రెండుసార్లు పసిడి పతకాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్న ప్రమోద్ డబుల్స్‌లో సుకంత్ కదమ్‌తో కలిసి నంబర్‌వన్ ర్యాంకులో ఉండడం విశేషం.