calender_icon.png 11 March, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లలిత్ మోదీకి షాక్..

10-03-2025 11:43:48 PM

వనాటు పౌరసత్వం రద్దు..

స్వదేశీ దర్యాప్తు తప్పించుకోవడానికే పౌరసత్వం డ్రామా..

రద్దు వెనుక భారత ప్రభుత్వం కీలకపాత్ర..

పోర్ట్ విల్లా: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీకి ఊహించని షాక్ ఎదురైంది. ఇటీవలే లలిత్ మోదీ పసిఫిక్ ద్వీప దేశమైన వనాటు ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోథం నపాట్ ఆ దేశ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. వనాటు పౌరసత్వం పొందడానికి చట్టబద్ధమైన కారణాలు తప్పనిసరి. అయితే స్వదేశం భారత్ నుంచి దర్యాప్తు తప్పించుకునేందుకే వనాటు పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోంది. అతడు చూపిన కారణం కూడా చట్టబద్ధంగా లేకపోవడంతో లలిత్ పౌరసత్వం రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వనాటు ప్రధాని తెలిపారు.

అయితే లలిత్ మోదీకి వనాటు పౌరసత్వం రద్దు వెనుక భారత్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో లలిత్ మోదీ వేల కోట్లు దుర్వినియోగం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. 2009లో దేశం విడిచి పారిపోయిన లలిత్ 15 ఏళ్లుగా లండన్‌లో తలదాచుకుంటున్నాడు. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వనాటు పౌరసత్వం తీసుకొని తన మకాంను మార్చాలనే యోచనలో ఉన్నట్లు లండన్‌లోని భారత హైకమీషనర్ కార్యాలయానికి సమాచారం అందింది. అందుకు అనుగుణంగానే లలిత్ వనాటు పౌరసత్వం తీసుకునేందుకు తన భారత పాస్‌పోర్టును అప్పగించేందుకు ఇటీవలే లండన్‌లోని రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.

న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్, ఇతర ద్వీప దేశాలతో కలిసి ఈ అంశాన్ని లేవనెత్తారు. లలిత్ మోదీని మాకు అప్పగించాలంటూ భారత్ ఇంటర్‌పోల్ అధికారులను ఆశ్రయించింది. అయితే ఇంటర్‌పోల్ తనిఖీలలో అతడిపై ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది. దీంతో భారత్ అభ్యర్థనను ఇంటర్‌పోల్ తిరస్కరించింది. ఈలోగా కారణాలు చట్టబద్ధంగా లేకపోవడంతో  వనాటు ప్రభుత్వం లలిత్ పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు తెలపడం భారత్‌కు కాస్త ఉపశమనం కలిగించింది. వనాటు పౌరసత్వ రద్దుతో లలిత్ మోదీకి కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశముంది. పౌరసత్వం కోల్పోవడం వల్ల అతడు ఇప్పుడు వేరే దేశాల్లో నివాసం పొందడం కష్టతరంగా మారనుంది.