calender_icon.png 5 February, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయులకు షాక్

22-01-2025 12:00:00 AM

అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన డొనాల్డ్  ట్రంప్ తొలి రోజే పలు సంచలనాలకు తెరతీశారు. ఎన్నికల ప్ర చార సమయంలో హామీ ఇచ్చినట్లుగా అక్రమ వలసలను అరికట్టడంతో పాటుగా పదుల సంఖ్యలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో అత్యం త ప్రధానమైనది ‘జన్మతః పౌరసత్వం’పై వేటు. దాదాపు వందేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న ఈ విధానానికి ట్రంప్ స్వస్తి పలికారు.

ఈ నిర్ణయం ప్ర భావం అమెరికాలో ఉంటున్న లక్షలాదిమంది భారతీయులపై తీవ్ర ప్రభా వం చూపించనుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారితో పాటుగా విద్యార్థులు, టూరిస్టు, హెచ్1బీ లాంటి తాత్కాలిక వర్క్ వీసాలపై దే శంలో ఉంటున్న వారికి జన్మించే పిల్లలకు ఇకపై అమెరికా పౌరసత్వం ల భించదు. ఈ తరహా పౌరసత్వాన్ని ఏ దేశం కూడా ఇవ్వడం లేదని, తాముకూడా ఇచ్చేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరై నా అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాసం, గ్రీన్‌కార్డు, అమెరికా మిలిటరీ సభ్యత్వం ఇలా ఏదైనా ఒక గుర్తింపు ఉంటేనే వారి పిల్లలకు పుట్టుకతో దే శ పౌరసత్వం ఇస్తామని తేల్చి చెప్పారు. అయితే అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం ఇస్తున్నట్లు ట్రంప్ చెప్పిన దాంట్లో నిజం లేదు. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలు ఇలా పౌరసత్వాన్ని ఇస్తున్నాయి. అమె రికాలో అంతర్యుద్ధం ముగిసిన మూడేళ్ల తర్వాత 1868లో ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణతో ఈ హక్కు లభించింది.

శరణార్థులుగా వచ్చిన నల్లజాతివారిని బానిసలుగా చూసే దుష్ట సంప్రదాయానికి ముగింపు పలకడానికి ఇది వీలు కల్పించింది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇది రద్దు కానుంది. ఈ ఉత్తర్వు 30 రోజుల తర్వాతినుంచి అమలులోకి రానుంది. అయితే చట్టబద్ధంగా ఇది అమలు కావడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు. ట్రంప్ ఉత్తర్వులను న్యాయస్థానాలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించే అవకాశం ఉంది.

అమెరికా సుప్రీంకోర్టు సైతం జన్మతః పౌరసత్వాన్ని సమర్థించింది. ఆ అవకాశాలు లేకపోలేదని ట్రంప్ కూడా చెప్పడం గమనార్హం.   అంతేకాదు ఉత్తర్వు అమలుకు రాజ్యాంగ సవరణ అవసరం. అమెరికా పార్లమెంటులోని ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో సవరణను ఆమోదించాలి. ఇది సుదీర్ఘ ప్రక్రియ. మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేసేందుకు హక్కుల సంఘాలు సిద్ధమవుతున్నాయి.

ఇదంతా అటుంచితే  దీని ప్రభావం భారతీయులపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 2024 నాటికి అమెరికాలో దాదాపు 54లక్షల మంది భారతీయులు ఉన్నారు. దేశ జనాభాలో 1.47 శాతానికి ఇది సమానం. వీరిలో 34 శాతం మంది అమెరికాలో పుట్టిన వారు కాగా, మిగతా వా రంతా వలస వచ్చిన వారే. అందులో ఎక్కువమంది హెచ్1బీ వీసా కింద వచ్చిన వారే.

వాస్తవానికి అమెరికా వెళ్ల్లిన భారతీయుల్లో చాలామంది తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందేందుకు ‘బర్త్ టూరిజం’ను అంటే పిల్లలకు జన్మనివ్వడం కోసమే అమెరికాకు వెళ్లడాన్ని ఒక మార్గంగా ఎంచుకొంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మెక్సికో, చైనాలాంటి  దేశాల వారూ ఇదే పద్ధతి అనురిస్తున్నారు. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా అది దక్కా లంటే ఏళ్ల తరబడి వేచిచూడాలి.

అందుకే తమ పిల్లలకు,  తద్వారా తమ కూ అమెరికా పౌరసత్వం దక్కేందుకు ఈ మార్గాన్ని ఎంచుకొంటున్నారు. ఇప్పటికే ఇలా అమెరికాలో పుట్టిన పిల్లలు వేల సంఖ్యలో ఉ న్నారు. వీరు కూడా అమెరికాలోనే ఉండాలంటే చదువుతో పాటుగా అన్ని విషయాల్లో ను ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

అలాగని కుటుంబాలు వేరుపడడం కూడా సాధ్యం కాదు. స్వదేశానికి తిరిగి వెళ్లడం ఒక్కటే మార్గం. ట్రంప్ కోరుకొంటున్నది కూడా అదే. అయితే  దేశంలోని అన్ని వ్యవస్థలపైనా దీని ప్రభావం పడుతుందనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు.