calender_icon.png 18 October, 2024 | 5:53 PM

ఉద్యోగులకు షాక్.. మెటా మరోసారి లేఆఫ్స్

18-10-2024 01:12:39 AM

కాలిఫోర్నియా: టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మొదలైన లేఆఫ్స్ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత మాంద్యం భయాలతో ఉద్యోగులను ఎడాపెడా పీకేసిన సంస్థలు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.

తాజాగా ఫేస్‌బుక్  మాతృసంస్థ అయిన మెటా  మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్స్ కోసం పనిచేస్తున్న టీమ్‌లతో సహా మెటా వర్స్ అంతటా లే ఆఫ్స్‌ను ప్రకటించింది. అయితే, ఎంత మంది ఉద్యో గులను తొలగిస్తుందనే సమాచారాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు.

రిక్రూటింగ్, లీగల్ ఆపరేషన్ వంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. కాగా, మెటా ఇప్పటికే పలుసార్లు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో ఏకంగా 11 వేల మందిపై వేటు వేసింది. ఇక గతేడాది రెండు విడతల్లో సుమారు  10 వేల మందిని ఇంటికి సాగనంపింది.

ఇప్పుడు తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్దం కావడం టెక్ ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. లేఆఫ్స్ గురించి ఇప్పటికే సదరు ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.