కింగ్‌ఫిషర్, హెనికిన్ బీర్ల సరఫరాను నిలిపివేసిన యూబీఎల్
- నాలుగేళ్లుగా మద్యం ధరలు సవరించడం లేదని ఆరోపణ
- రూ.700 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి ఉందన్న సంస్థ
- బేవరేజస్ కార్పొరేషన్‌కు నోటీలిచ్చిన యూబీఎల్ సంస్థ
- 10 శాతం ధరలు పెంచాలని ప్రభుత్వానికి వినతి
- బేవరేజస్ సంస్థ గుత్తాధిపత్యాన్ని ఒప్పుకోం: మంత్రి జూపల్లి
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ తగిలింది. ఐదేళ్లుగా ధరలను ప్రభుత్వం సవరించకపోవడంతో నష్టాలు వస్తున్నాయని, అందువల్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు సంబంధిత శాఖకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీఎల్ ) లిమిటెడ్ సంస్థ లేఖ రాసినట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
పెరిగిన ఉత్పత్తి వ్యయానికి తగ్గట్టు ధరలు పెంచకపోవడం వల్ల సరఫరా చేయలేమని స్పష్టంచేసింది. దీంతో యూబీఎల్ కంపెనీ సరఫరా చేసే కింగ్‌ఫిషర్, హెనికిన్ బీర్ల సరఫరా ఆగిపోయింది. తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ నుంచి తమకు రూ.700 కోట్ల వరకు బకాయి ఉందని, పైగా 2019 నుంచి ధరలను కూడా సవరించకపోవడంతోనే బీర్ల సరఫరా నిలిపివే యాలని నిర్ణ యం తీసుకున్నట్టు పేర్కొంది.
ఏటా తమ బీ ర్ల సరఫరా ద్వారా ప్రభుత్వానికి రూ.4,500 కోట్ల ఆదాయం వస్తుందని వివరించింది. ప్ర తి మద్యం బాటిల్‌పై ప్రభుత్వానికి 80 శాతం వరకు ఆదాయం వస్తుం దని తెలిపారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న ధరల కంటే 10 శాతం అదనంగా పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వం కంపెనీలకు చెల్లించే కమిషన్ పెంచితే, ఆ భారం వినియోగదారులపై పడనుంది.
80 శాతం బీర్ల సరఫరా యూబీఎల్ నుంచే..
రాష్ట్రంలో ప్రధానంగా ఆరు కంపెనీలు బీర్లను సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి సరఫరా అవుతున్న బీర్లలో 75 నుంచి 80 శాతం వరకు యూబీఎల్ నుంచి సరఫరా ఉండగా, మిగతా 5 కంపెనీల నుంచి 25 శాతం వరకు సరఫరా అవుతున్నట్టు అబ్కారీశాఖ వర్గాలు చెప్తున్నాయి. మద్యం కంపెనీలు బెవరేజస్ కార్పొరేషన్‌కు మద్యం సరఫరా చేసిన తర్వాత 45 రోజుల్లో బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వ హయాం నుంచి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ప్రతి నెలా కొంత చెల్లిస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెప్తున్నారు. యూబీఎల్ సంస్థకు ప్రభుత్వం నుంచి రూ.700 కోట్ల బకాయి ఉన్నట్టు సమాచారం. ఈ కంపెనీ ప్రధానంగా కింగ్‌ఫిషర్ బీర్ తయారుచేస్తుంది.
బేవరేజస్ కార్పొరేషన్‌లో సీసీఐ నిబంధనలు పెట్టాలి
అబ్కారీశాఖ డైరెక్టర్ చెవ్యూరి హరికిషన్
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ (కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) నిబంధనలను తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ చెవ్యూరు హరికిరణ్ తెలిపారు. సీసీఐ నిబంధనలపై బుధవారం అబ్కారీ భవన్‌లో బెవరీజస్ కార్పొరేషన్ ఉద్యోగులకు స్టేట్ రీసోర్స్ పర్సన్ ఆర్‌సీ కుమార్ ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
సీసీఐ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరికిషన్ మాట్లాడుతూ.. కంపెనీల మధ్య పోటీ ఉంటే వినియోగదారులకు మేలని, అదే వారు సిండికేట్‌గా మారితే వినియోగదారులకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి బేవరేజస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహం, కాశీనాథ్, శీలం శ్రీనివాసావుతోపాటు ఇతర ఉద్యోగులు హాజరయ్యారు.
కోర్టు కేసులపై స్పందించాలి
అబ్కారీ శాఖలోని కోర్టు కేసులకు సంబంధించి డైరెక్టర్ హరికిషన్ సమీక్ష నిర్వహించారు. శాఖకు సంబంధించిన కోర్టు కేసుల విషయంలో సంబంధిత అధికారులు నిర్ణిత సమయంలో స్పందించాలన్నారు. కోర్టు నోటీసులకు వెంటనే స్పందించాలని, సమయంలోపు సమాధానం ఇవ్వాలన్నారు.
కోర్టులో వేసే రిట్ పిటిషన్లు, వివిధ రకాల రిట్ ఫైల్స్‌పై కంటెంట్ ఆఫ్ కోర్టు కేసులపై సీరియస్‌గా ఉండాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు, జాయింట్ కమిషనర్లు ఖురేషి, కేఏబీ శాస్త్రీ, సురేశ్‌తోపాటు రఘురాం, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్, శ్రీధర్, ప్రణవ్ పాల్గొన్నారు.
యూబీఎల్ కోరినట్టు ధర పెంచితే బీరు రూ.25౦
- కమిటీ నివేదిక వచ్చాక రేట్ల పెంపుపై నిర్ణయం
- ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
యూనైటెడ్ బేవరేజస్ సంస్థ అడిగినట్టు బీర్ల ధరలు పెంచితే వినియోగ దారులపై అధిక భారం పడుతుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ౬౯ శాతం వాటా కలిగిన బెవరేజస్ సంస్థ.. సరఫరాపై గుత్తాధిపత్యంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. బుధవారం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. బీర్ల ధరలను 33 శాతం పెంచాలని సంస్థ కోరుతున్నదని, ఇలా పెంచితే ఇప్పుడు రూ.150కు ఉన్న బీరు ధర రూ.250కి చేరుతుందని తెలిపారు.
బీరు రేట్ల పెంపు విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా ట్యాక్స్ పెంచలేదని చెప్పారు. ఒక బీరు రేటు కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180 ఉంటే తెలంగాణలో రూ.150 మాత్రమే ఉందన్నారు. బీరు రేట్లు పెంచాలని యూబీఎల్ సంస్థ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు.
రేట్లు పెంచే అంశంపై విశ్రాంత జడ్జితో కమిటీ వేశామని, కమిటీ నివేదిక వచ్చాక రేట్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో నష్టాల్లో ఉన్నట్టు ఆ సంస్థ చెప్తుందన్నారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో రూ.407.34 కోట్ల బకాయిలు పెట్టిందన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 7 వరకు యూబీఎల్ సంస్థకు ప్రభుత్వం రూ.1,130.99 కోట్లు చెల్లించామని, ఇంకా రూ. 658.95 కోట్లు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం 14 లక్షల బీర్ల కేసుల స్టాక్ ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కొంత ఎక్కువగానే ఉందన్నారు. యూబీఎల్ సంస్థ మాత్రం రూ. 900 కోట్ల బకాయి ఉందని చెప్పడంలో వాస్తవం లేదన్నారు.