calender_icon.png 19 September, 2024 | 7:10 AM

నేడు శోభాయాత్ర

17-09-2024 01:01:41 AM

  1. గణనాథుడి ఊరేగింపునకు హైదరాబాద్‌లో పటిష్ట బందోబస్తు 
  2. 25 వేల మంది పోలీసుల పహారా.. ట్రాఫిక్ ఆంక్షలు 
  3. జలమండలి అధికారులు, సిబ్బందికి 72 గంటల పాటు సెలవులు రద్దు 
  4. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): గత కొన్నిరోజులుగా భక్తు లు పూజలు అందుకున్న గణనాథుడికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. నేడు(మంగళవారం) గణేశ్ శోభాయాత్ర, నిమజ్జ నాన్ని పురస్కరించుకొని జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వినాయక నిమజ్జనం ట్యాంక్‌బండ్‌లో ఉం టుందా.. లేదా అనే ఉత్కంఠకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆదివారం చేపట్టిన తీవ్రమైన నిరసన, ఆందోళనతో తెరపడింది. ప్రభుత్వం ట్యాంక్‌బండ్ వైపు కూడా క్రేన్లను ఏర్పాటు చేయడంతో  నగరవ్యాప్తంగా గణనాథుడి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజాలో ఇప్పటి వరకూ నిమజ్జనం కొనసాగుతుండగా, ఆదివారం నుంచి ట్యాంక్‌బండ్ వైపు కూడా అధికారులు నిమజ్జనానికి అనుమతించారు. ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తం నగరవ్యాప్తంగా సుమారు లక్ష విగ్రహాల నిమజ్జనం జరగనుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగరవ్యాప్తంగా 468 క్రేన్లు వినియోగిస్తున్నారు.   

భారీ బందోబస్తు..

నిమజ్జనం నేపథ్యంలో బందోబస్తు కోసం 25 వేల మంది పోలీసులను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేవలం హుస్సేన్ సాగర్ చుట్టూ 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  మహిళల భద్రతకు కోసం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే 12 షీటీమ్స్ పహారా కాయనున్నాయి.   

బుధవారం ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. 

నిమజ్జన సమయంలో నగరవ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 64 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్యాంక్‌బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సిటీలోకి భారీ వాహనాలకు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు.  అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్లు 9010203626, 8712660600, 040 27852482కి ఫోన్ చేయొచ్చని తెలిపారు. 

15 వేల మంది సిబ్బంది..  

గణేశ్ నిమజ్జనానికి ఇంజినీరింగ్, శానిటేషన్, యూబీడీ, యూసీడీ తదితర విభాగా లకు చెందిన అధికారులు, సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో 24 గంటల పాటు పనిచేసేలా 15 వేల మంది విధుల్లో పాల్గొననున్నారు. నిమజ్జనం మరుసటి రోజు కూడా మరో 500 మంది పారిశుద్ధ్య నిర్వహణ చేసేందుకు అదనపు సిబ్బంది అందుబాటులో ఉండేలా జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. నగరంలోని ప్రధాన చెరువులతో పాటు 73 ప్రాం తాల్లో ప్రత్యేక పాండ్స్ ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్ర ధాన కంట్రోల్ రూంతో పాటు మరో 10 కంట్రోల్ రూంలను అధికారులు ఏర్పాటు చేశారు. 

భక్తుల కోసం 35 లక్షల వాటర్ ప్యాకెట్లు 

శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో రోడ్లపై సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జలమండలి డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భక్తుల కోసం 122 చోట్ల 35 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. సచివాలయం, పరిసర ప్రాంతాల్లో క్యాంపులు ఉంటాయన్నారు. రాబోయే 72 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.  

అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు..

నిమజ్జనం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంటకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. చివరి రైలు ఒంటిగంట వరకు అందుబాటులో ఉంటుందని, 2 గంటల వరకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ల వద్ద అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 

9 గంటలకు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర..

బాలాపూర్ గణేశుడి వద్ద 220 మంది పోలీసులతో, 30 సీసీ టీవీ కెమెరాలతో రాచకొండ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. వేలంపాట అనంతరం ఉదయం 9 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది. 16 కి.మీ ప్రయాణం అనంతరం ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోనుంది.

ఏర్పాట్లు పూర్తిచేశాం : ఆమ్రపాలి, జీహెచ్‌ఎంసీ కమిషనర్

నగరంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నెల రోజులుగా ఉత్సవ కమిటీ సభ్యులు, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాం. నిమ జ్జనానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేపట్టాం. విగ్రహాలను నిమజ్జనానికి తీసుకువచ్చే సమ యంలో రోడ్లపై కలర్ పేపర్లను చల్లడం వల్ల పారిశుద్ధ్య సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేపర్లు వెదజల్లకుండా భక్తులు సహకరించాలి. శోభాయాత్రకు ఆటంకాలు కలగకుండా రోడ్డు మరమ్మతులు, రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలను తొలగించాం.

హెల్త్ క్యాంపులు, అంబులెన్సులు

మంత్రి దామోదర రాజనర్సింహ

గణేశ్ నిమజ్జనం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద వైద్య సేవలు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జనం జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో 30 హెల్త్ క్యాంప్‌లు,అంబులెన్స్‌లు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ తనవంతు బాధ్యత వహిస్తుందని మంత్రి తెలిపారు.

733 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

ఊరేగింపులో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సీపీకి సూచించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, బైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్‌లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకోసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కమాండ్ కం ట్రోల్ సెంటర్ నుంచి 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీపీ ఆనంద్ సీఎంకు వివరించారు.