calender_icon.png 18 October, 2024 | 2:12 PM

నేటి జర్నలిస్టులకు షోయబుల్లాఖాన్ స్ఫూర్తిదాయకం

18-10-2024 11:35:59 AM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలంతో ప్రశ్నించిన నికార్సైన కలంవీరుడు షోయబుల్లాఖాన్. నేటి జర్నలిస్టులకు షోయబుల్లాఖాన్ ఎంతో స్ఫూర్తిదాయకమని రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. రాయపోల్ మండల కేంద్రం ప్రెస్ క్లబ్ లో షోయబుల్లాఖాన్ 104వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు.  సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపనతో షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకొని మొదట షోయబ్ 'తేజ్ 'అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, అతని తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు.

ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. దాంతో ‘తేజ్’ పత్రికను నిషేధించారు. ‘రయ్యత్’ ఉర్దూ దినపత్రికలో పనిచేశారు. అనంతరం ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాసిన అక్షర వీరుడన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి నర్సింలు, జర్నలిస్టు సభ్యులు మన్నె గణేష్, కనుక స్వామి, ప్రజా సంఘాల నాయకులు లింగం, శ్రీకాంత్, నవీన్, భాను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.