05-04-2025 12:00:00 AM
రాజశేఖర్ దంపతుల కూతురు శివాని తల్లిదండ్రుల వారసురాలిగా సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించడం ద్వారా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తాజాగా శివానీ రాజశేఖర్ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని పొందారు. ప్రముఖ ఆవిష్కర్త జీడీ నాయుడు జీవిత విశేషాలతో ఓ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో శివానీ భాగం కానున్నారు. ‘ది ఎడిసన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన జీడీ నాయుడు బయోపిక్‌కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
జీడీ నాయుడు వృత్తిపరమైన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలతోపాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్న మాధవన్‌తో శివానీ రాజశేఖర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. జూన్ నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొననున్నారు. మాధవన్ గతంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాన్ని ‘రాకెట్ ట్రీ: ది నంబి ఎఫెక్ట్’ పేరుతో తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా జీడీ నాయుడు బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుండటం విశేషం. కోయంబత్తూర్‌లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జీడీ నాయుడు పూర్తిపేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు.
ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో విప్లవం సృష్టించిన జీడీ నాయుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్‌ను రూపొందించారు. ఈ కారణంగా మిరాకిల్ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. ఓ ప్రముఖుడి జీవిత విశేషాలతో తెరకెక్కనున్న సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవడం పట్ల అందరూ శివాని లక్కీ ఛాన్స్ కొట్టేసిందంటూ ఆమెను అభినందిస్తున్నారు.