calender_icon.png 9 January, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివం భజే ఒక జానర్‌కి పరిమితమైన సినిమా కాదు

31-07-2024 12:27:42 AM

“నేను శివభక్తుడినే. అయితే ఈ సినిమా ఆ కారణంగా చేసింది కాదు” అంటూ ‘శివం భజే’ సినిమా సంగతులను పాత్రికేయులతో పంచుకున్నారు నిర్మాత మహేశ్వర్ రెడ్డి. ఆయన నిర్మాణంలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ హీరోహీరోయిన్లుగా అప్సర్ దర్శకత్వం వహించిన ‘శివం భజే’ చిత్రం ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “ఆగస్టు 1న అశ్విన్‌ది, నాది పుట్టిన రోజని ఈ సినిమా ఆ రోజున విడుదల చేయడం లేదు. వ్యాపార కోణంలో అన్ని రకాలుగా ఆలోచించి ఆ రోజు తగినదని భావించాం. ముందుగా ఈ కథ విన్న నేను, నచ్చడంతో వెంటనే అడ్వాన్స్ ఇచ్చాను. తర్వాత అశ్విన్‌ని కలవగా ఆయనకి నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. ఐదు నిమిషాల్లోనే సినిమా చేద్దామని చెప్పారు.

కథని ఇప్పుడు ఏ మాత్రం రివీల్ చేయలేం. అయితే ఈ సినిమా ఒక జానర్‌కి పరిమితమైనది మాత్రం కాదు. సంగీత ప్రాధాన్యం గల ఈ సినిమా కోసం ‘హిడింబ’లో వికాస్ బడిస పనితనం చూసి ఈ సినిమాకి తీసుకున్నాం. కథని వీలైనంత మెరుగ్గా తెరమీద చూపించేందుకు అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే పెట్టాం. వెంకటేశ్ గారు ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు” అని ‘శివం భజే’ విషయాలను తెలిపారు. తమ బ్యానర్ నుంచి రానున్న సినిమాల గురించి ప్రస్తావిస్తూ “ఐఐటీ కృష్ణమూర్తి టీమ్‌తో సినిమా అనుకుంటున్నాం. హీరో కార్తికేయతో కూడా ఓ సినిమా చేయనున్నాం. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం” అని చెప్పుకొచ్చిన ఆయన, ‘శివం భజే’ సాధించే విజయాన్ని బట్టి రీమేక్ ఉంటుందన్నారు.