- నిరాశపరిచిన షూటర్లు అవని, మోనా
- షాట్‌పుట్‌లో భాగ్యశ్రీకి ఐదో స్థానం
- క్వార్టర్స్‌లో పారా ఆర్చర్ పూజా ఓటమి
పారిస్ పారాలింపిక్స్‌లో ఆరో రోజు భారత్‌కు పెద్దగా కలిసి రాలేదు. ఐదో రోజు 8 పతకాలతో మోత మోగించిన మన అథ్లెట్లు మంగళవారం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. షూటింగ్‌లో మరో పతకం తెస్తుందనుకున్న అవని లేఖరా నిరాశపరచగా.. పతాకధారిగా వ్యవహరించిన భాగ్యశ్రీ షాట్‌పుట్‌లో ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక పతకంపై ఆశలు రేపిన పారా ఆర్చర్ పూజ క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది.
పారిస్: ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్‌లో మరో పతకం సాధించాలనుకున్న భారత పారా షూటర్ అవని లేఖరాకు నిరాశే ఎదురైంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ పొజిషన్ ఈవెంట్‌లో ఫైనల్లో అవని ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో అవని 420.6 పాయింట్లు స్కోరు చేసింది. మరో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే వెనుదిరిగింది. జర్మనీ పారా షూటర్ నటాచా హిల్‌ట్రోప్ (456.5 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా.. స్లొవేకియాకు చెందిన వెరొనికా (456.1 పాయింట్లు), చైనా షూటర్ జాంగ్ (446 పాయింట్లు) రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. రైఫిల్ పొజిషన్ మొత్తం మూడు విభాగాల్లో ( ప్రోన్, స్టాండింగ్, నీలింగ్)లో నిర్వహిస్తారు.
స్టాండింగ్, ప్రోన్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన అవని నీలింగ్‌లో తక్కువ స్కోరు చేయడంతో ఐదో స్థానానికి పరిమితమైంది. అంతకముందు క్వాలిఫికేషన్ రౌండ్‌లో 1159 పాయింట్లు స్కోరు చేసిన అవని ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక మరో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ 1147 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. కాగా మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1 వ్యక్తిగత విభాగంలో అవని లేఖరా స్వర్ణం సాధించగా.. మోనా అగర్వాల్ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.
భాగ్యశ్రీ మెరవలే..
పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పతాకధారిగా వ్యవహరించిన భాగ్యశ్రీ జాదవ్ ఎఫ్ 34 మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో నిరాశపరిచింది. మంగళవారం జరిగిన వుమెన్స్ ఎఫ్ 34 షాట్‌పుట్ ఫైనల్లో భాగ్యశ్రీ గుండును 7.28 మీటర్లు మాత్రమే విసిరి ఐదో స్థానానికి పరిమితమైంది. చైనాకు చెందిన లిజుయన్ (9.14 మీ) సీజన్ బెస్ట్‌తో పసిడి నెగ్గగా.. పోలండ్‌కు చెందిన లుసీనా (8.33 మీ), మొరాకోకు చెందిన సైదా (7.80 మీ) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
పూజకు నిరాశే..
పారాలింపిక్స్‌లో ఆర్చరీలో మరో పతకం ఖాయమనుకున్న తరుణంలో మహిళా ఆర్చర్ పూజ జత్యాన్ నిరాశపరిచింది. మంగళవారం జరిగిన పోటీల్లో పూజ క్వార్టర్స్‌లో ఓటమి చవిచూసింది. క్వార్టర్స్‌లో పూజ 4 తేడాతో చైనా పారా ఆర్చర్ చున్‌యాన్ చేతిలో ఓడిపోయింది. ఇప్పటికే నాలుగు పారాలింపిక్స్ పతకాలతో పాటు 2016 రియోలో టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన చున్‌యాన్ ముందు పూజ నిలవలేకపోయింది. అంతకు ముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పూజ 6 తేడాతో టర్కీకి చెందిన సెంగుల్ యాగ్ముర్ మీద సునాయస విజయం సాధించింది.
1997లో రెండు నెలల పసికందుగా ఉన్న సమయంలో పూజకు జ్వరం వచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక ఇంజక్షన్‌కు బదులు మరో ఇంజక్షన్ ఇవ్వడంతో పూజ ఎడమ కాలుకు పోలియో సోకింది. అయితే చిన్నప్పటి నుంచి ఆర్చరీపై మనసు పారేసుకున్న పూజ తన ఏకాగ్రతను కోల్పోలేదు. 2023లో ఆసియా పారా చాంపియన్‌షిప్‌లో పూజ రజతం గెలిచింది.
పారాలింపిక్స్‌లో నేటి భారతీయం
పారా షూటింగ్
మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్
ఎస్‌హెచ్1 క్వాలిఫికేషన్
పారా అథ్లెటిక్స్
పురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 ఫైనల్
మహిళల షాట్ పుట్ ఎఫ్ 46 ఫైనల్
పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 ఫైనల్
పారా టేబుల్ టెన్నిస్
మహిళల సింగిల్స్ క్లాస్ 4 (క్వార్టర్స్)
పారా పవర్ లిఫ్టింగ్
పురుషుల 49 కేజీలు , మహిళల 45 కేజీలు ఫైనల్
పారా ఆర్చరీ
పురుషుల రికర్వ్ వ్యక్తిగత 1/8
ఎలిమినేషన్ రౌండ్