- నీట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు
- ప్రోత్సాహకం అందజేసిన ఐటీడీఏ పీవో రాహుల్
భధ్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 24(విజయక్రాంతి): కృషి, పట్టుదల, లక్ష్యం ఉంటే సాధించలేనిది ఏమి లేదని మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన గిరిపుత్రికలు రుజువుచేశారని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ గురుకులంలో చదివి ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన విద్యార్థులను గురువారం ఆయన తన ఛాంబర్‌లో అభినందించారు.
వారికి ఐటీడీఏ ప్రోత్సాహాకం కింద రూ. 50వేల చొప్పున అందజేశారు. గుండాల మండలం సాయినగర్ కాలనీకి చెందిన ఇర్పా అమృత తరణి నార్కెట్ పల్లి కామినేని మెడికల్ కాలేజీలో, అదే మండలం పాలగూడెం గ్రామానికి చెందిన వజ్జా వీరాకుమారి, ఏటూరు నాగారం మండలం కాటారం గ్రామానికి చెందిన కుడుముల సాత్విక, వెంకటాపురం మండలానికి చెందిన పూనెం గీతాంజలి ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంతటితో చదువు పూర్తి అయిందని అనుకోవద్దని, కష్టపడి చదివి పీజీలోనూ సీటు సాధించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
తీరిక సమయంలో కింది తరగతి విద్యార్థులకు తాత్కాలిక ఫ్యాకల్టీలుగా పనిచేసి ఎంతోకొంత సంపాదిం చుకోవాలని, తల్లిదండ్రులకు భారం కావద్దని సూచించారు. కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజు, సు న్నం రాంబాబు, ఖమ్మం డీడీ ట్రైబల్ వెల్ఫేర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.