calender_icon.png 17 November, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిండే, అజిత్‌లు.. గుజరాత్‌కు గులాంలే

17-11-2024 01:55:17 AM

వెన్నుపోటు రాజకీయాల బీజేపీని తరిమికొట్టాలి 

  1. ముంబైని దోచుకోడానికే ప్రధాని, అదానీ వస్తున్నారు
  2. కూటమి గెలుపునకు కార్యకర్తలు వీరుల్లా కష్టపడాలి
  3. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : వెన్నుపోటు రాజకీయాలతో విపక్ష ప్రభుత్వాలపై కుట్రలు చేసే బీజేపీని మహారాష్ట్ర ప్రజలు పాతిపెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గుజరాత్‌కు గులాంలుగా మారిన ఏక్‌నాథ్‌షిండే, అజిత్ పవార్ లాంటి వెన్నుపోటు దారులతో క్షుద్ర రాజకీయాలు చేసే బీజేపీని తరిమికొట్టి, తగిన గుణపాఠం చెప్పాలని కోరా రు.

తెలంగాణలో కూడా కేసీఆర్‌ను తరిమికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. మహారాష్ట్రలోనూ మహావికాస్ అగాడీ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చంద్రాపూర్, యావత్‌మాల్, వార్దా, నాగపూర్ జిల్లా ల్లో పర్యటించారు. చంద్రపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో బహిరంగ సభలతోపాటు నాగపూర్‌లో రోడ్డు షోలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని, మాట్లడారు. 

కూటమి అభ్యర్థులను గెలిపించా లని ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రజాతీర్పును ఏక్‌నాథ్‌షిండే, అజి త్ పవార్ కాలశారని మండిపడ్డారు. దేశంలో ఉన్న ఆరు మహానగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్‌లో బీజేపీకి స్థానం లేదని, ముంబైలో కూడా బీజేపీకి స్థానం ఉండబోదని చెప్పారు. ముంబైని దోచుకో వడానికే గుజరాత్ నుంచి మోదీ, అదానీలు ఇక్కడికి వస్తున్నారని విరుచుకు పడ్డారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా ముంబై నగరం మహావికాస్ అగాడీతోనే ఉంటుందని చెప్పారు. మహారాష్ట్రలో జరిగేవి ఎన్నికలు కావని, ఇది పోరాటమని అన్నారు. శివాజీ మహారాజ్, బాబా సాహెబ్, బాలా సాహెబ్ వారసులుగా బీజేపీ బందిపోటు ముఠాను రాహుల్‌గాంధీ సైనికులుగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

అధికారంలోకి రాగానే 5 గ్యారెంటీలు అమలు 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.  రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అందుకే 25 రోజుల్లోనే రూ.2 లక్షల వరకు రూ.18 వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీని చేశామని చెప్పారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇప్పటివరకు 25 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్టు సీఎం వివరించారు. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇది గుజారత్ సహా ఏ రాష్ట్రంలో ఇవ్వలేదని స్పష్టంచేశారు. గుజరాత్‌లో ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్కొక్కటిగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, మహారాష్ట్రలోనూ మహావికాస్ అగాడీ కూటమి అధికారంలోకి రాగానే 5 గ్యారెంటీలను అమలు చేస్తుందని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. 

‘రాజురా’ నుంచే కొండా లక్ష్మణ్‌బాపూజీ ప్రాతినిధ్యం 

చంద్రాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్‌వేకర్‌ను, రాజురాలో సుభాష్ దోతేను 50 వేల మెజార్టీతో గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు.  రాజురా నియోజకవర్గం నుంచి హైదరాబాద్ స్టేట్‌లో కొండా లక్ష్మణ్‌బాపూజీ చట్టసభకు ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా విదర్భ తెలంగాణ ప్రాంతాల మధ్య బంధుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయని, ఆ అనుబంధంతోనే మీ అన్నగా తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు.


రాజురా నియోజక వర్గంలో కూటమి అభ్యర్థి సుభాష్‌దోతేను గెలిపిస్తే.. ఆయనతో పాటు పొరుగు రాష్ట్ర సీఎంగా ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యతను తీసుకుంటానని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. రాజురా అసెంబ్లీ సీటులో ఓటమి తప్పదని బీజేపీ తన బీటీమ్‌కు చెందిన వ్యక్తులను బరిలోకి దింపిందని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

వార్దాలో కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్‌రావు ఠాక్రే గెలుపును కాంక్షిస్తూ ప్రచారం చేశారు. అనంతరం నాగ్‌పూర్ రోడ్డుషోకు హాజరై.. శేఖర్ శెండే తరఫున ప్రచారం చేశారు. ఆయా సభల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు. 

మనమంతా హైదరాబాద్ సంస్థానానికి చెందిన వాళ్లమే 

‘మీరంత మా సోదరులు.. మనమంతా ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానానికి చెందిన వాళ్లమే. రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒకే కుటుంబం.. బంధుత్వాలు, అనుబంధాల పరంగా కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు కూడా మనమంతా కలిసి కట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.

ఇక్కడ సుభాష్ దోతేను గెలిపించాలి ’ అని రాజురా నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి  పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్, బడుగుల ఆశాజ్యోతి పూలే ఈ గడ్డపైన పుట్టిన వారేనని.. అదే స్ఫూర్తితో ఎన్నికల్లో ఓటేయాలని కోరారు.