పొట్టి ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశాలు అదరగొడుతున్నాయి. గ్రూప్ సంచలన ప్రదర్శనతో అమెరికా అందరి మన్ననలు అందుకుంటే.. గ్రూప్ వెస్టిండీస్ విజృంభిస్తోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో నెగ్గిన విండీస్.. న్యూజిలాండ్ సూపర్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కివీస్ ఇక ముందంజ వేయాలంటే అద్భుతం జరగాల్సిందే!
కివీస్ పేసర్ల ధాటికి కకావికలం అయ్యేలా కనిపించిన కరీబియన్ ఇన్నింగ్స్‌ను షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ ఆదుకున్నాడు. పావెల్, పూరన్, చేజ్, చార్లెస్, కింగ్, రస్సెల్ విఫలమైన చోట.. షెర్ఫాన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా సిక్సర్లతో రెచ్చిపోయిన షెర్ఫాన్ విండీస్‌కు ఊహించని స్కోరు అందించాడు. ఆనక బౌలర్లు సమష్టిగా కదంతొక్కడంతో.. ఓ మాదిరి లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
టరోబా: ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ జట్టు.. టీ20 వరల్డ్‌కప్‌లో అదరగొడుతోంది. స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో తిరుగులేకుండా సాగుతున్న విండీస్.. వరుసగా మూడో విజయంతో సూపర్ అర్హత సాధించింది. గురువారం గ్రూప్ భాగంగా జరిగిన పోరులో వెస్టిండీస్ 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. గత దశాబ్ద కాలంగా ఐసీసీ టోర్నీల్లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు సాధించిన న్యూజిలాండ్.. వరుసగా రెండో పరాజయంతో సూపర్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక గ్రూప్ దశలో మిగిలిన రెండు మ్యాచ్‌లు నెగ్గినా న్యూజిలాండ్ ముందంజ వేయాలంటే.. ఇతరల జట్ల ఫలితాలు అనుకూలించాల్సిన పరిస్థితి నెలకొంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (9), జాన్సన్ చార్లెస్ (0), నికోలస్ పూరన్ (17), రోస్టన్ చేజ్ (0), కెప్టెన్ రావ్‌మన్ పావెల్ (1) ఘోరంగా విఫలమవడంతో విండీస్ ఒక దశలో 30 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి స్థితిలో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (39 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) పిడుగుల్లాంటి షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అకీల్ హుసేన్ (15), రస్సెల్ (14), రొమారియో షెఫార్డ్ (13) తలా కొన్ని పరుగులు చేశారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, సౌథీ, ఫెర్గూసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులకు పరిమితమైంది. గ్లెన్ పిలిప్స్ (40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. ఫిన్ అలెన్ (26; 3 ఫోర్లు, ఒక సిక్సర్), శాంట్నర్ (21 నాటౌట్; 3 సిక్సర్లు) కాస్త పోరాడారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4, మోతీ మూడు వికెట్లు పడగొట్టారు. కరీబియన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన షెర్ఫాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
30/5 నుంచి..
‘విశ్వవ్యాప్తంగా ఎక్కడ టీ20 లీగ్ జరిగినా అందులో ప్రధానం గా కనిపించే వెస్టిండీస్ ప్లేయర్లు.. కలిసికట్టుగా మా త్రం అదే స్థాయి ప్రదర్శన కనబర్చలేరు’.. ఇది కరీబియన్ల గురించి గత కొంతకాలంగా విశ్లేషకులు చెబుతున్న మాట. ఇది తప్పని నిరూపించేందుకు విండీస్ ప్లేయర్లు శతవిధాల కృషి చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు (2012, 2016లో) టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ నెగ్గిన వెస్టిండీస్ జట్టు.. ఈ సారి స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలోనూ విజేతగా నిలవలనే పట్టుదలతో కనిపిస్తోంది. గ్రూప్ భాగంగా తొలి పోరులో పపువా న్యూగినియాపై 5 వికెట్ల తేడాతో నెగ్గిన విండీస్.. రెండో మ్యాచ్‌లో ఉంగాడాను 134 పరుగుల తేడాతో చిత్తుచేసింది.
ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అయితే.. ఊహించని స్థితి నుంచి తిరిగి పుంజుకుంది. కివీస్ పేసర్లు విజృంభించడంతో ఒక దశలో 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన విండీస్.. కాసేపటికి 76/7తో నిలిచింది. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరిపోవడంతో ఇక కరీబియన్‌ల ఖేల్ ఖతం అని భావిస్తే.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ అద్వితీయ పోరాటం కనబర్చాడు. అప్పటి వరకు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసిన ప్రతి బౌలర్‌ను చీల్చి చెండాడిన షెర్ఫాన్ జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కరీబియన్లు సమష్టిగా సత్తాచాటారు.
సూపర్ అఫ్గాన్ కన్ను
ట్రినిడాడ్: టీ20 ప్రపంచకప్‌లో అంచనాలకు మించి రాణిస్తోన్న అఫ్గానిస్థాన్ జట్టు సూపర్ బెర్తుపై కన్నేసింది. ఈ నేపథ్యంలో నేడు పసికూన పపువా న్యూ గినియాతో అఫ్గానిస్థాన్ అమీతుమీకి సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు నమోదు చేసిన అఫ్గాన్.. పపువాపై విజయంతో దర్జాగా సూపర్ అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ నుంచి వెస్టిండీస్ సూపర్ చేరింది. పపువాపై అఫ్గాన్ గెలిస్తే మాత్రం హాట్ ఫేవరెట్ న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.
ఎందుకంటే ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ప్రస్తుతం సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్న రషీద్ ఖాన్ సేనకు పపువాపై విజయం పెద్ద కష్టం కాకపోవచ్చు. మరోవైపు టీమిండియా చేతిలో ఓటమి చవిచూసిన ఆతిథ్య అమెరికా 48 గంటల వ్యవధిలో ఐర్లాండ్‌తో కీలకపోరుకు సిద్ధమైంది. సూపర్ అడుగుపెట్టాలంటే ఐర్లాండ్‌పై అమెరికాకు గెలుపు తప్పనిసరి. శుక్రవారం ఫ్లొరిడా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం ముప్పు అమెరికా కంటే పాకిస్థాన్ జట్టుకు ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దు అయితే 5 పాయింట్లతో అమెరికా సూపర్ అడుగుపెట్టే అవకాశముంది.