కుంభకోణంతో ప్రమేయం ఉన్న అధికారులు, కీలక నేతలపై నివేదిక సిద్ధం?
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గొర్రెల స్కాం విచారణ కీలకదశకు చేరుకుంది. బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో జరిగిన ఈ స్కాంను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వెలికితీసింది. స్కాంలో రూ.700 కోట్లు దుర్వినియోగం అయినట్లుగా ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్‌కుమార్, పశుసంవర్ధక శాఖ సీఈవో ఎస్ రాంచందర్ సహా పలువురిని ఏసీబీ అదుపులోకి తీసుకున్నది. వీరితో పాటు రాష్ట్రస్థాయి నుంచి జిల్లాల్లో క్షేత్రస్థాయి వరకూ వెళ్లి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఏసీబీ డీజీగా ఉన్న సీవీ ఆనంద్ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారణ వేగవంతం అయ్యేలా కృషి చేశారని తెలుస్తోంది. ఈ కేసులో పైనుంచి కింది వరకు ఉన్న వారి పాత్రేమిటో ఏసీబీ పూర్తిగా గుర్తించినట్లు సమాచారం. గొర్రెల స్కాంలో లబ్ధిదారుల ఎంపిక నుంచి గొర్రెల కొనుగోళ్లు, వాటిని లబ్ధిదారులకు అందజేసేంత వరకు పూర్తి వివరాలను ఏసీబీ సేకరించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో గొర్రెల లబ్ధిదారులతో మాట్లాడడంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో గొర్రెలను కొనుగోలు చేసిన వ్యాపారుల వద్దకు వెళ్లి.. వారిని సైతం విచారించింది. గొర్రెల అసలు ధరను కాదని ఇష్టానుసారంగా పెంచి ప్రభుత్వా ఖజానాకు ఏ మేరకు నష్టం వాటిల్లచేశారో గుర్తించారు.
జిల్లాల అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఈ కేసులో ఉన్నారని ఏసీబీ నివేదిక సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులు, పశుసంవర్ధక శాఖకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి వరకు ఈ స్కాంలో ఎవరి పాలు ఎంతో ఏసీబీ చిట్టా సిద్ధం చేసింది. రేపో మాపో ఈ కేసు విచారణకు కీలకమైన నేతలకు ఏసీబీ నోటీసులు ఇ చ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా, నాటి పశుసంవర్ధకశాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన ఓ అధికారి హడా విడిగా ఫైళ్ల ను తరలించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుతో తనకేం సంబంధం లేదన్నట్లుగా మాజీ మంత్రి వ్యవహ రించారు. ఏసీబీ సైతం అప్పట్లో ఆయన పాత్రపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ కేసు విచారణ తుది దశకు చేరుకున్న నేప థ్యంలో ఎవరెవరిని ఏసీబీ విచారిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.