05-03-2025 07:01:10 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మహిళల భరోసా కోసం షీ టీంలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయని షీ టీం మహిళా కానిస్టేబుల్ జ్యోతి అన్నారు. మహిళల భద్రత, మహిళా చట్టాలు, మహిళలపై వేధింపులు, ఆన్లైన్ మోసాలు, సెల్ఫోన్ నష్టాలపై బుధవారం బెల్లంపల్లిలోని కస్తూరిబా గాంధీ విద్యాలయం విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. మహిళలు, విద్యార్థినిల భద్రత కోసం ప్రతిరోజు బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాలతో పాటు కళాశాలలు, జన సమీకరణ ప్రాంతాలలో నిఘా ఉంచడం జరుగుతుందని ఆమె తెలిపారు.
మహిళలు తమ వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని, మొబైల్ యాప్ లలో వచ్చే అనుమానాస్పద లింకులను ఓపెన్ చేసి చూడవద్దని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయవద్దని ఆమె కోరారు. మహిళలను గాని, విద్యార్థినిలను గాని ఎవరైనా వేధిస్తే భయపడకుండా 6303923700 లేదా 100 డయల్ కు కాల్ చేసి సమస్యను తెలపాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ నెంబర్ 1930 కి కాల్ చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఏఎస్ఐ మజార్ హుస్సేన్, బెల్లంపల్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రజిత, సతీష్ తదితరులు పాల్గొన్నారు.