calender_icon.png 6 January, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ రిటర్న్స్‌లో ఆమె టాప్

12-12-2024 12:00:00 AM

ఈతరం మహిళలు మగవారితో సమానంగా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. రంగం ఏదైనా సరే ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే ఇతర రంగాలతో పోలిస్తే ఐటీలో రాణించే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో మహిళలే ముందుంటున్నారు. 

తెలంగాణలో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు మహిళలు ఆసక్తిని కనబరుస్తున్నారు. 2020 నుంచి 2024 మధ్య కాలంలో స్త్రీల రిటర్న్స్ దాదాపు 39.4శాతం పెరిగాయి. రిటర్నులు ఫైల్ చేసే మహిళలు పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో 95.7శాతంతో మిజోరాం ఉండగా, వృద్ధిలో తెలంగాణ నాలుగో స్థానం ఉంది. ఎక్కువ మంది మహిళలు ఐటీఆర్ దాఖలు చేస్తున్న జాబితాలో మాత్రం రాష్ట్రం 12వ స్థానంలో ఉంది.

ఆ జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానం లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2023 ఆర్థిక సంవత్సరంలో 26.92లక్షల మంది ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేశారు. 16,64,019 మంది జీరో ట్యాక్స్ ఫైలింగ్ చేశారు. ఇందులో మహిళలు 8,55,113 మంది ఉన్నారు. గతేడాది 7,79,088 మంది మహిళలు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేశారు.

ఎందుకంటే..

2020 తర్వాత తెలంగాణలో ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఎక్కువ మహిళలు ఆసక్తిని కనబర్చడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా తర్వాత చాలామంది మహిళలు ఇంటి దగ్గర ఉండి వ్యాపారాలు చేయడం పెరిగింది. ముఖ్యంగా ఫుడ్ ఆధారిత పరిశ్రమలు పెరిగాయి. వ్యాపారాలకు సం బంధించిన రుణాల విషయంలో వీరు ఐటీఆర్ దాఖలు చేయడం అనివార్యమైంది.

రూ.5 లక్షలపైన ఆదాయం ఉంటే.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఐటీ రంగంలో దాదాపు 50 నుంచి 60 శాతం ఉద్యోగుల జీతం రూ. 5లక్షలపైనే ఉంటుంది. ఈ కేటగిరిలో మహిళల సంఖ్య పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, మహిళలు ఐటీ ఉద్యోగాల్లో మహిళల రిక్రూట్‌మెంట్ కూడా పెరగడం ఈ రిటర్నులు పెరగడానికి  కారణంగా తెలుస్తోంది.

ప్రభుత్వ పథకాలతో..

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసే కొన్ని పథకాలు కూడా మహిళలు ఐటీఆర్ దాఖలు చేయడానికి కారణంగా తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారులకు, అలాగే ఇళ్లను కట్టుకోవడానికి పథకాలను అమలు చేస్తున్నా యి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇళ్లను మహిళల పేరు మీదనే ఇస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోనివారు.. రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. అలాగే, వివిధ వ్యాపారులకు కేంద్రం మహిళలకు రుణాలను ఇస్తూ.. ప్రత్యేక రాయితీలు ఇస్తోంది. ఆ రుణాలను పొందాలంటే.. ఐటీ రిటర్న్స్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా పలు కారణాలతో తెలంగాణలో ఆదాయపు పన్ను రిటర్నులు పెరిగాయి.

ఆ రాష్ట్రాల్లోనే మూడో వంతు

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఐటీ రిట ర్న్స్ దాఖలు చేస్తున్న మహిళల్లో మెజార్టీ శాతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం నుంచి ఉన్నట్లు ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో మూడో వంతు మహిళలు ఐటీ నుంచే ఉండటం గమనార్హం. కానీ తెలంగాణ నుంచి దాఖలవు తున్న మహిళల ఐటీ రిటర్న్స్‌లలో ఐటీ ఉద్యోగుల వాటా ఆ స్థాయిలో లేదని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా తర్వాత చాలా మంది మహిళలు హోమ్ మేడ్ వ్యాపారాలపై మొగ్గు చూపడం కూడా మరో కారణం.

 కొడవలికంటి నవీన్, విజయక్రాంతి