ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తిరిగి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా జీ కేంద్రమంత్రి మేనకా గాంధీ మిగతా బీజేపీ అభ్యర్థుల్లాగా రామమందిరం, హిందుత్వ అంశాలను తన ప్రచారంలో వాడుకోవడం లేదు. నియోజకవర్గంలో తాను గత అయిదేళ్లలో చేసిన పనులనే తన ప్రచారాస్త్రంగా చేసుకుని జనాన్ని ఓట్లడుగుతున్నారు. నియోజక వర్గంలో అందరికీ మేనకాగాంధీ ‘మాతాజీ’ అయి తే, ప్రతి ఒక్కరూ ఆమెకు బేటా, బేటీ అవుతారు. వాస్తవానికి మేనకాగాంధీ సుల్తాన్ పూర్‌లో ఉన్నప్పుడు ఆమె దినచర్య ప్రతి రోజూ ఉదయాన్నే నిర్వహించే ‘జన దర్బా ర్’ మొదలవుతుంది.
ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆమె ఈ దర్బార్‌లో ప్రజల సమస్యలను విని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి ఆదేశాలు ఇస్తూ ఉంటా రు. అందుకోసం ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్లతో సిద్ధంగా ఉంటారు. ‘జన దర్బార్’ ముగిసిన వెంటనే ఆమె అల్పాహారానికి సిద్ధమవుతారు. అప్పుడు అక్కడున్న అందరికీ ఆహ్వానం ఉంటుంది. అల్పాహారం పూర్తి కాగానే ఆమె తన ప్రచారం మొదలు పెడతారు. చాలా మంది బీజేపీ అభ్యర్థుల్లాగా కాకుండా ఆమె రామమందిరం, హిందుత్వ అంశాలను తన ప్రచార ంలో ప్రస్తావించరు. తాను 2019లో ఈ నియోజకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటినుంచి నియోజక వర్గాన్ని బాగు చేయ డంపైనే ఆమె దృష్టిపెట్టారు.
“మీకు ఓ తల్లిని కావడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. తల్లి ఏం కావాలి? మన ఇంట్లో ఉన్నవాళ్లు సంతోషంగా ఉంటే ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది. నేను కూడా ఇదే మీ కోసం కోరుకుంటున్నాను” అని ఆమె తన ప్రచారం ప్రారంభ ంలో చెబుతుంటారు. 67 ఏళ్ల మేనకాగాంధీ దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన ఎంపీ. ఆమె ఇప్పుడు 11వ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇంతకు ముందు పోటీ చేసిన పది సార్లలో 8 పర్యాయాలు ఆమె విజయం సాధించారు. దివంగత మాజీ ప్రధాని ఇంది రాగాంధీ పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ సతీమణి అయిన మేనకాగాంధీ ‘గాంధీ- నెహ్రూ’ కుటుంబంతో సంబంధాలు తెంచుకుని దూరంగా ఉంటు న్నారు. గాంధీ కుటుంబసభ్యుల్లో దాదా పు అందరూ ప్రాతినిధ్యం వహించింది యూపీయే అయినా ప్రస్తుతం మేనకాగాంధీ మాత్రమే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆమె తోటి కోడలైన సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ రాష్ట్రంలోని పిలిభిత్ నియోజకవర్గానికి 1996 నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈసారి బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీనిపై మేనకాగాంధీ మాట్లాడుతూ వరుణ్‌కు టికెట్ ఎందుకు నిరాకరించారో తనకు తెలియదని అంటున్నారు. తన నియోజకవర్గంలో అతను చాలా పాపులర్ అని, అతను ఎక్కడకు వెళ్లినా, ఏం చేసినా దేశానికి మంచే చేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక ప్రచారం విషయానికి వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె 12 కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. తాను తొలిసారి సుల్తాన్‌పూర్‌కు వచ్చినప్పుడు జనం తాను ఏం చేస్తానని అనుమానంగా చూశారని ఆమె అంటారు. ఆ ఎన్నికల్లో ఆమె కేవలం 14 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి తన మెజారిటీ లక్షల్లో ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. దానికి కారణాలు కూడా ఆమే చెప్తున్నారు. ‘అంత తక్కువ మెజారిటీ వచ్చినప్పుడే అధికారుల నుంచి ఎన్నో పనులు చేయించాను. లక్షల్లో గెలిస్తే ఇంకెంత చేయవచ్చో కదా?’ అని ఆమె అంటారు. అంత భారీ మెజారిటీ రావడానికి ప్రణాళికను కూడా ఆమె పార్టీ కార్యకర్తలకు వివరిస్తున్నారు. పర్యావరణ ప్రేమికురాలైన మేనకా గాంధీ తన నివాసం చుట్టూ ఉన్న చెట్లు అన్నిటినీ గుర్తు పెట్టుకుంటారు.
ఆమెకు జంతుప్రేమ కూడా ఎక్కువే. ఒక్కోసారి ఈ జంతుప్రేమ కారణంగా ఆమె విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆమె తన విధానాన్ని మాత్రం మార్చుకోలేదు. ఆమె కారు దిగి బైటికి అడుగుపెడితే నియోజక వర్గ ప్రజలకు ‘మాతాజీ’యే. ప్రతి ఒక్కరు కూడా ఆమెను అలాగే పిలుస్తారు కూడా. తాను తన పేరును కూడా ‘మాతాజీ మేనకా గాంధీ’గా మార్చుకోవాలేమోనని ఆమె నవ్వుతూ అంటుంటారు. ఎన్నికల సభల్లో ఆమె గత అయిదేళ్లలో నియోజకవర్గానికి చేసిన పనులను మాత్రమే ప్రస్తావిస్తారు. ప్రజలకు మేలు చేసే కేంద్రప్రభుత్వ పథకాల గురించి కూడా వివరిస్తారు.
నియోజకవర్గానికి ఆమె చేసిన గొప్ప పని ఏమంటే తొలిసారి ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే చంద్రభద్ర సింగ్ అలియాస్ సోనూ సింగ్ బాహుబలి పెత్తనానికి చరమగీతం పాడడం. మేనకా గాంధీ రాక ముందు ఇక్కడికి ప్రభుత్వ బస్సులు కూడా వచ్చేవి కావని, ఇప్పుడూ తిరుగుతున్నాయని స్థానికులు సంతోషంగా చెప్తారు. తాను ఎప్పుడు కూడా ఎవరినీ కులం, మతం గురించి అడగనని, తాను మీకేం చేయగలని మాత్రమే అడుగుతానని మేనకా గాంధీ సగర్వంగా చెప్తారు.