09-02-2025 12:00:00 AM
ఎందరో హీరోయిన్లు తమ అందం, అభినయం, ఆంగికంతో మెప్పిస్తున్నారు. అయినా కొందరు హీరోలు స్త్రీ వేషధారణలో కనిపించారు. ఇలా ఎందుకూ? అంటే కథలో భాగంగా ఇతర పాత్రలను మభ్యపెట్టడానికే! అలా లేడీ గెటప్‌లో తెరపై సందడి చేసిన నటులు దాదాపు అన్ని చిత్రసీమల్లోనూ ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలాంటి రోల్స్ ప్లే చేయటం సాధారణమే. మరి హీరోలు కూడా లేడీ గెటప్ వేస్తే సాహసమే! అలా సాహసం చేసిన ఆమె గురించి.. సారీ ఆయన గురించి చూద్దాం!!
‘ఒక్క రోజు వేషం కోసం దాసరి మీసం కొరిగినట్టు..’ అనే మాట పల్లెటూళ్లలో ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అంటే కొద్దిపాటి దాని కోసం అంత కష్టం అవసరమా అనే అర్థంలో వాడుతారీ సామెత. మరి ఇలా రెండు గంటలపాటు ప్రజలకు వినోదం పంచేందుకు మీసాలు తీసేయాల్సిందేనా? తప్పదు!
ఎందుకంటే ఓ పురుషుడు, స్త్రీ వేషంలో కనిపించేది రెండు మూడు గంటల పాటే కావొచ్చు కానీ ఆ వేషంలో ఆయన అభినయించటం మాత్రం తరతరాలు చెప్పుకుంటారు కదా! ఒక నటుడిగా కావాల్సిందీ అదే కదా?! మరి పురుషులు స్త్రీ వేషం ధరించటం ఒక్క వీధినాటకాలకే పరిమితమైందా? అంటే అస్సలు కానే కాదు.
ఎందుకంటే ‘చెంచులక్ష్మి’, ‘అల్లి రాణి’, ‘భూకైలాసం’ లాంటి నాటకాల ప్రదర్శన డేరాల్లో నుంచి వెండితెరపైకి మారాయి. కాకపోతే ఆ నాటకాల ప్రదర్శన డేరాల మధ్య జరిగిన రోజుల్లో పురుషులే స్త్రీ వేషంలో కనించారు. కానీ అదే నాటకం వెండితెరపైకి సినిమాగా వచ్చేసరికి స్త్రీ వేషాన్ని మహిళలే ధరించారు.
అలా సినిమాల్లో మహిళా నటుల కొరత లేకున్నా కొందరు పురుషులు లేడీ గెటప్‌లో కనిపించారు. ఎందుకలా అంటే, అదే అసలు ‘కథ’. ఔను, కథాపరంగా పురుషులు స్త్రీ వేషం కట్టక తప్పలేదు. అలా లేడీ గెటప్‌లో తెరపై సందడి చేసిన నటులు చిత్రసీమలో చాలా మందే ఉన్నారు. కథలో భాగంగా ఇతర పాత్రలను మభ్యపెట్టడానికి నటులు అప్పుడప్పుడూ ఇలా మహిళలుగా మారాల్సి వస్తుంది.
క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలాంటి రోల్స్ ప్లే చేయటం సాధారణమే. మరి హీరోలు చేయటం సాహసమే అవుతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి లాంటి అగ్ర కథానాయకులు ఈ ప్రయోగం చేసి విజయాన్ని అందుకున్నారు.
వీరు పూర్తిగా స్త్రీగా కనిపించటానికి తగిన మేకప్‌తో ముస్తాబు కాగా, వెంకటేశ్, అల్లరి నరేశ్ లాంటి వారు మీసం తీయకుండానే అమ్మాయి వేషంలో కనిపించి, నవ్వులు పూయించారు. ఇంకొందరు కేవలం పాటల్లోనే మహిళగా కనిపించారు.
లేడీ గెటప్ అనేది చిన్న విషయం కాదని తెలిసీ ఆకర్షించినవారెందరో. ‘భామనే సత్యభామనే’ అంటూ వచ్చిన కమల్‌హాసన్ గెటప్ ఎవర్ గ్రీన్. రాజేంద్రప్రసాద్ ‘మేడమ్’గా మెప్పించగా, ‘రెమో’లో శివ కార్తికేయన్ సినిమా అంతా లేడీ గెటప్‌లోనే కనిపించారు.
టాలీవుడ్‌లో...
‘చంటబ్బాయ్’ సినిమాలోని ‘నేనో ప్రేమ పూజారి’ పాటలో హీరోయిన్ సుహాసినిని ఇంప్రెస్ చేసేందుకు చిరంజీవి వేసిన పలు వేషాల్లో లేడీ గెటప్ కూడా ఒకటి. ఆధ్యాత్మిక చిత్రమైన ‘పాండురంగడు’లో బాలకృష్ణ కొన్ని క్షణాల పాటు అమృత అనే పాత్రలోకి ప్రవేశిస్తారు.
బాలకృష్ణ ‘టాప్‌హీరో’ సినిమాలోనూ మహిళగా కనిపించారు. ‘వాసు’, ‘బాడీగార్డ్’ చిత్రాల్లో వెంకటేశ్, ‘గంగోత్రి’లో అల్లు అర్జున్, ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మంచు మనోష్ లేడీ వేషంలో కనిపించారు. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘జంబలకిడి పంబ’ సినిమాల్లో సీనియర్ నరేశ్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ‘కితకితలు’లో అల్లరి నరేశ్,
బాలీవుడ్‌లో..
‘లావరిస్’లోని ఓ పాటలో అమితాబ్ బచ్చన్, ‘జానే మన్’లో సల్మాన్ ఖాన్, ‘డూప్లికేట్’లో షారుక్ ఖాన్, ‘బాజి’లోని ఓ పాటలో ఆమిర్ ఖాన్, ‘హమ్‌షకల్స్’లో సైఫ్ అలీఖాన్, ‘ఖిలాడి’లో అక్షయ్‌కుమార్, ‘అప్నా సప్నా మనీ మనీ’లో రితేశ్ దేశ్‌ముఖ్, ‘ఆంటీ నంబర్ 1’లో గోవింద లేడీ గెటప్‌లో సందడి చేశారు. ‘డ్రీమ్ గర్ల్’, ‘డ్రీమ్‌గర్ల్ 2’ సినిమాల్లో ఆయుష్మాన్ ఖురానా అమ్మాయిగా కనిపించారు.
ఇతర చిత్రసీమల్లో...
కన్నడ చిత్రం ‘అన్నర్వ మక్కళు’లో ప్రముఖ కథానాయకుడు శివరాజ్‌కుమార్, ‘పనక్కరణ్’ చిత్రంలోని ఓ పాటలో కోలీవుడ్ స్టార్ రజనీకాంత్, ‘అయన్’ (వీడొక్కడే)లోని ఓ పాటలో సూర్య, ‘ప్రియమనవలే’లో విజయ్, ‘మల్లన్న’లో విక్రమ్, ‘వాడు వీడు’లో విశాల్ ప్రేక్షకుల్ని కట్టి పడేశారు.