23-03-2025 12:52:27 AM
నిధి అగర్వాల్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నది. ఈ సందర్భంగా తను నటించిన ఓ మూవీ యూనిట్ పెట్టిన విచిత్రమైన షరతును ఈ సందర్భంగా వెల్లడించిందీ ముద్దుగుమ్మ. “మున్నా మైకేల్’ అనే బాలీవుడ్ సినిమాతో సినీ పరిశ్రమలో నా కెరీర్ ప్రారంభమైంది. దీనిలో కథానాయకుడిగా టైగర్ ష్రాఫ్ నటించారు. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత నాతో టీం కాంట్రాక్ట్‌పై సంతకం చేయించుకుంది. ఆ కాంట్రాక్ట్‌లో సినిమాకు సంబంధించిన విధి విధానాలన్నీ పొందుపర్చారు.
అందులో ఒక షరతు.. నో డేటింగ్. హీరోతో సినిమా పూర్తయ్యే వరకూ డేటింగ్ చేయకూడదన్నది షరతు. తొలుత ఇవేమీ చదవకుండానే కాంట్రాక్ట్ మీద సైన్ చేశా. తర్వాత విషయం తెలిసి అవాక్కయ్యా. నటీనటులు ప్రేమలో పడితే వర్క్‌పై దృష్టి పెట్టరని టీమ్ భావించి అలాంటి షరతు పెట్టిందని అనుకున్నా” అంటూ నిధి చెప్పుకొచ్చింది. ఆన్‌లైన్ ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. “ప్రపంచంలో మంచి, చెడు రెండూ ఉంటాయి.
మంచిదాన్ని కాబట్టి అంతా నాతో మంచిగా ఉంటారనుకోవడం తప్పు. కొందరు చెడుగానూ మాట్లాడతారు. కానీ హద్దులు దాటి అసభ్య పదజాలం వాడటం సరికాదు. నేను చాలా స్ట్రాంగ్. అలాంటివి పట్టించుకోను. కానీ అంతా అలా ఉండరు. కొందరు చాలా బాధపడతారు. ఈ విషయాన్ని గ్రహించి కాస్త మర్యాదగా కామెంట్స్ చేస్తే బాగుంటుంది” అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.