10-02-2025 01:22:37 PM
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్
ఎగిరిన సిద్దిపేట కీర్తి పతాక
సిద్దిపేట,(విజయక్రాంతి): ప్రపంచ యవనికపై సిద్దిపేట కీర్తి పతాక మరోమారు రెపరెపలాడింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన శత సహస్ర సూర్య నమస్కారల ప్రదర్శన అద్భుతంగా సాగింది. లక్ష్య సూర్య నమస్కారాలు చేయడం లక్ష్యం కాగా 4, 02,154 మంది సూర్య నమస్కారాలు చేసిన యోగ సాధకులు ప్రపంచానికి ఆరోగ్య సందేశాన్ని ఇచ్చారు. వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు ఇంటర్నేషనల్ రికార్డులో ఈ సూర్య నమస్కారాలు నమోదు చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇంటర్నేషనల్ ప్రతినిధి జ్యోతి నిర్వాహకులకు సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 1484 మంది యోగ సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు.
సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో శత సహస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన జాతీయస్థాయిలో రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర యోగ అధ్యయన పరిషత్ సభ్యులు, జాతీయ యోగ మెడలిస్ట్ , ప్రముఖ యోగ గురువు తోట సతీష్ నేతృత్వంలో ప్రదర్శన , రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. 25 సంవత్సరాల లోపు, 25 సంవత్సరాల పై వయస్సు వారికి వేరువేరుగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు జరిగాయి. నాలుగు విభాగాల్లో జరిగిన పోటీల్లో ఐదు సంవత్సరాల నుంచి మొదలుకొని 72 సంవత్సరాల వయసు ఉన్న వారు ఉత్సాహంగా పాల్గొని ఉత్తేజాన్ని నింపారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు, యోగసాధకులకు అతిథులు మెడల్ , సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.