calender_icon.png 19 April, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ కోసం పారిపోయారు.. 64 ఏళ్ల తర్వాత పెళ్లి

28-03-2025 12:03:52 AM

మృదు, హర్షద్‌ల అందమైన ప్రేమకథ..

కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా షష్ఠిపూర్తి వేడుకలు..

అహ్మదాబాద్: ప్రేమ, పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. అందరూ ప్రేమలో పడకపోవచ్చు.. కానీ వివాహ బంధంలోకి ఒక జంట అడుగుపెట్టడం సర్వసాధారణం. ప్రేమ పెళ్లిళ్లు కానీ.. పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ.. కలకాలం బతకాల్సింది మాత్రం పెళ్లి చేసుకున్న దంపతులే. ఈ కాలంలో ప్రేమ కోసం చనిపోతున్నారు.. లేదంటే చంపేస్తున్నారు తప్ప కలిసి బతికే ప్రయత్నం చేసేవారు చాలా అరుదు. పెద్దలను ఒప్పించి లేదా వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు సైతం ఆ బంధాన్ని కలకాలం నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు. అలాంటి వారందరూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అందమైన ప్రేమకథను ఆదర్శంగా తీసుకోవాల్సిందే.

సుమారు 64 ఏళ్ల క్రితమే తమ ప్రేమను దక్కించుకోవడం కోసం పెద్దవాళ్లను ఎదిరించి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా ఒకరి చేయి ఒకరు వదల్లేదు. అలా 64 ఏళ్లు గడిచిపోయాయి. వాళ్ల పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లతో జీవితాన్ని ఆనందంగా గడిపారు. ఒకప్పుడు ఎవరి తోడు లేకుండా ఒంటరిగా పెళ్లి చేసుకున్న ఆ దంపతులకు మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగింది. అదే విషయాన్ని వారి పిల్లల వద్ద ప్రస్తావించగా.. వారు ఎగిరి గంతేసి తమ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా పెళ్లి జరిపించారు. ఈ ముచ్చటైన పెళ్లి వేడుకకు గుజరాత్ వేదిక అయింది.

1961లో మొదలైన ప్రేమకథ..

జైన కుటుంబానికి చెందిన హర్షద్, బ్రాహ్మణ వర్గానికి చెందిన మృదు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఒకే స్కూళ్లో చదువుకున్న ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 1960ల నాటి కాలంలో ప్రేమ అంటే అప్పటి సమాజంలో కఠిన ఆంక్షలు ఉండేవి. ఆడపిల్లను బయటికి పంపాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే రోజులవి. కానీ ఆ భయాలను లెక్కచేయని హర్షద్, మృదు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా.. వారు నిరాకరించారు. దీంతో తమ  ప్రేమను బతికించుకోవడం కోసం 1961లో ఇంటి నుంచి పారిపోయారు. ఎవరి తోడు లేకుండానే ఇద్దరే వివాహం చేసుకున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా ఇద్దరు కలిసే పోరాడాలని తీర్మానం చేసుకున్నారు.

అలా మొదలైన వారి వైవాహిక బంధం 64 ఏళ్ల పాటు ఆనందంగా కొనసాగింది. అయితే 60 ఏళ్ల క్రితం తమ వివాహం ఎంత సింపుల్‌గా జరిగిందో కుటుంబసభ్యులకు వివరించారు. అందుకే షష్ఠిపూర్తి వేడుకను ఘనంగా చేయాలని భావించారు. గుజరాతీ పెళ్లి వేడుక సంప్రదాయ పద్దతిలో మృదు, హర్షద్‌ల వివాహం జరిపించారు. ఒకప్పుడు ఒంటరిగా పెళ్లి చేసుకున్న వీరు ఈసారి కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకోవడం ఆ వృద్ధ దంపతుల జీవితాల్లో  మరుపురానిదిగా మిగిలిపోనుంది.