calender_icon.png 9 March, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సుల్లో ఫ్రీ.. ఫ్రీ అంటూ.. ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణం

07-03-2025 03:28:22 PM

అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆయా జిల్లాల పరిధిలో మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన వివరణను ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల(Andhra Pradesh Congress Chief YS Sharmila) తీవ్రంగా విమర్శించారు. ఉచిత ప్రయాణాన్ని హామీ ఇచ్చి, తరువాత షరతులు విధించడం ద్వారా పాలక కూటమి మహిళా ఓటర్లను తప్పుదారి పట్టించిందని ఆమె ఆరోపించారు. ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ.. ఫ్రీ(Free Bus Travel for Women) అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణమని మండిపడ్డారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం అన్నారు. అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులని షర్మిల మండిపడ్డారు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారని ద్వజమెత్తారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారని తెలిపారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో! అని చమత్కరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Congress Govt) అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణమే అన్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే అన్న షర్మిల(YS Sharmila) ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంతదూరమైనా జీరో టికెట్ అన్నారు. ఇలాంటి మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదా అని ప్రశ్నించారు. నెలకు రూ.350 కోట్లు మహిళల కోసం ఆర్టీసికి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదన్నారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా ?, ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా  సాధికారిత ? అని ప్రశ్నించారు. తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని, రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం(Free bus travel) సౌకర్యం ఉండాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.