calender_icon.png 25 September, 2024 | 7:52 PM

సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్.. షర్మిల నిరసన

25-09-2024 05:45:28 PM

విజయవాడ: సూపర్ సిక్స్ హామీల అమలును కూటమి ప్రభుత్వానికి గుర్తుచేసేందుకు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'థాలీ బజావో' కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి సీఎం చంద్రబాబు వినపడేలా పళ్లెం, గంటెతో నిరసన వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వమని ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలు ఈ ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వరదలకు 7లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతుల పరిహారం మీద కోత పెట్టారని ఆరోపించారు. తల్లికి వందనం పథకం అమలు లేదు. మహాశక్తి పథకం కింద ఇచ్చే రూ.1500 ఎక్కడ..? ఉచిత బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారు..? ప్రధాని మోడీకి రాష్ట్రంపై ఎప్పుడూ చిన్నచూపునే అన్నారు. వరద బాధితులకు కనీసం ఒక్క రైల్ నీర్ బాటిల్ కూడా ఉచితంగా ఇవ్వలేదన్నారు.

ఏడాదికి రూ.6వేల కోట్ల ఆదాయం విజయవాడ డివిజన్ ద్వారా రైల్వే శాఖ తీసుకుంటుంది. ఇదేనా మోడీకి రాష్ట్రం మీద ప్రేమ..? రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు.. బడ్జెట్ లేని రాష్ట్రం కూడా అని మండిపడ్డారు. 100 రోజుల్లో ఏ పథకానికి ఎంత బడ్జెట్‌నో చెప్పే ధైర్యం లేదు.. బాధ్యతలను విజయాలుగా చెప్పుకోవడం మానండి.. ప్రభుత్వానికి నిధుల కొరత అని చెప్పడం మానండని సూచించారు.

ఎన్నికలకు ముందే రాష్ట్రంలో రూ.11లక్షల కోట్లు అప్పులు అని మీకు తెలుసు కదా.. మరి  ఎందుకు హామీలు ఇచ్చారు..? మీ హామీలు నమ్మిన ప్రజలు మీకు ఓటేశారు. సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా..? ముంచే ప్రభుత్వమా..? గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే ప్రజలు మిమ్మల్ని నమ్మారని సూచించారు. అయితే రోజురోజుకు మీరు కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.