calender_icon.png 25 October, 2024 | 11:52 AM

షర్మిల సీఎం అవ్వడం ఖాయం

09-07-2024 02:18:38 AM

  • సీఎం రేవంత్ రెడ్డి 
  • మంగళగిరిలో వైఎస్సార్ జయంతి సభకు హాజరు

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): సంక్షేమ పథకాల అమలులో దివంగత నేత వైఎస్సార్ తనదైన ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సభకు రేవంత్‌రెడ్డి హాజ రయ్యారు. వైఎస్సార్ ఈ లోకానికి దూరమై 15 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు అందరిలోనూ మెదులుతున్నా యన్నారు. సీఎంగా ఉన్న సమయంలో వైఎస్సార్.. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేవారని గుర్తు చేశారు.

వైఎస్సార్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ జోడో యాత్రను చేపట్టారని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో అనతి కాలంలోనే ప్రజాభిమానాన్ని చూరగొన్న వైఎస్.షర్మిల కూడా భవిష్యత్‌లో ఖచ్చితంగా ఏపీ రాజకీయాలను శాసిస్తారన్నారు.

2029లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అలాగే షర్మిల కూడా ఏపీకి ముఖ్యమంత్రి అవుతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలన్నదే వైఎస్సార్ చివరి కోరిక అని అన్నారు. షర్మిల నాయకత్వాన్ని బలపరచాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహిస్తే పార్టీ మరింత బలపడుతుందని సూచించారు. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనలో ఉండటంతో సభకు రాలేకపోయారని పేర్కొన్నారు.