calender_icon.png 8 September, 2024 | 8:43 AM

నాతో చెప్పుకోండి

27-07-2024 03:54:05 AM

నేను.. మీ రేవంతన్నను!

  1. ఇబ్బందులుంటే పరిష్కరిస్తా
  2. ప్రతీ ఉద్యోగ ఖాళీని జాబ్ క్యాలెండర్‌తో భర్తీ చేస్తాం
  3. విద్యార్థులు, నిరుద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి భరోసా
  4. ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ప్రసంగం

రాజేంద్రనగర్, జూలై 26: ‘నేను మీ రేవంతన్నను.. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు నేరుగా చెప్పండి.. పరిష్కరిస్తా. మా మంత్రులను కలిసి కూడా మీ సమస్యలు చెప్పొచ్చు. మీకు ఈ రేవంతన్న అండగా ఉంటాడు’ అని విద్యార్థులు, ఉద్యోగార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తమది ప్రజాప్రభుత్వమని, అందుకు అనుగుణంగానే బడ్జెట్‌లో విద్య, వైద్యం, ఉపాధి, ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం వట్టినాగులపల్లిలో నాలుగో బ్యాచ్ ఫైర్‌మెన్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఫైర్‌మెన్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.

‘మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో మూడు నెలల్లో 31 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు. నిరుద్యోగులకు ఏమైనా సమస్యలుంటే నేరుగా మంత్రులను కలిసి వారి ఇబ్బందులు చెప్పుకోవచ్చు. యువతకు ఇబ్బందు లు ఉంటే వాటిని పరిష్కరించేందుకు రేవంతన్న అండగా ఉంటాడు’ అని పేర్కొన్నారు. గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎంతో ఎదురుచేశారని అన్నా రు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ప్రతీ ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.

రూ.2.91 లక్షల కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్య, వైద్యం, ఉపాధి, ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఎప్పడు వచ్చేవో తెలియదని, ప్రస్తుత ప్రజాప్రభుత్వం నెల మొదటి రోజునే జీతాలు, పెన్షన్లు ఇస్తున్నదని సీఎం తెలిపారు. డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలు, గ్రూపు 1,2లో 30 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు వెల్లడించారు. 

తల్లిదండ్రులను పట్టించుకోండి

ఉద్యోగాలు సాధించిన తర్వాత యువకులు తమ తల్లిదండ్రులను సరిగా పట్టించుకోవడం లేదని గ్రామాలకు వెళ్లినప్పుడు తన దృష్టికి వచ్చిందని, అలా చేయొద్దని ఉద్యోగాల్లో చేరబోయే ఫైర్‌మెన్లకు సీఎం సూచించారు. యువకులు కేవలం జీతం కోసం ఈ ఉద్యోగాల్లోకి రాలేదని, దేశానికి, సమజానికి సేవ చేసేందుకు ఉద్యోగాల్లో చేరడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు. శిక్షణ పూర్తిచేసుకున్న యువకులను చూసి వారి తల్లిదం డ్రుల గుండెలు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయని చెప్పారు. తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను బాగా చేసుకోవాలని హితవు పలికారు. 

టీజీపీఎస్సీలో నిపుణులనే నియమించాం 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)లో నిపుణులను నియమించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకొన్న 483 మంది ఫైర్‌మెన్లు, 150 మంది డ్రైవర్లకు ఈ కార్యక్రమలో సీఎం ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. శిక్షణలో ప్రతిభ చాటినవారికి జ్ఞాపికలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ డీజీపీ రవి గుప్త, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, యెగ్గె మల్లేశం పాల్గొన్నారు.