ఉత్సవాలకు ఆలయ ముస్తాబు
నిర్మల్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న సరస్వతి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 3 నుంచి 12 వరకు జరుగనున్నాయి. 9 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఆలయ అధికారులు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. సరస్వతి అమ్మవారు 9 రోజుల పాటు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్ అధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.