calender_icon.png 6 March, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు వద్దన్నారు... కార్మికులు కావాలన్నారు

06-03-2025 06:36:17 PM

నిరసనల మధ్య శాంతిఖని గని -2 లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ప్రజాభిప్రాయ సేకరణ... 

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పాత శాంతిఖని గని వద్ద గురువారం సింగరేణి అధికారులు లాంగ్ వాల్ ప్రాజెక్ట్-2 విస్తరణ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి నేతృత్వంలో 80 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిఖని గని-2 లాంగ్ వాల్ ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామాలైన గురిజాల, బట్వాన్పల్లి, పెరికపల్లి, ఆకెనపల్లి, లింగాపూర్, బుచ్చయ్యపల్లి, పాత బెల్లంపల్లి గ్రామాల రైతులు ప్రాజెక్టు పనులను వద్దని నినదిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా అంటూ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం లోపలికి చొచ్చుకొచ్చారు.

అప్పటికే కార్మిక సంఘాల నాయకులు లాంగ్ వాల్ ప్రాజెక్టుకు అనుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులతో మాత్రమే సమావేశాన్ని నిర్వహించాలని, కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవద్దని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా లాంగ్ వాల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కారుకూరి రామ్ చందర్ మాట్లాడుతూ... జి ఏం స్థాయి అధికారి చేసిన ఓపెన్ కాస్ట్ ప్రకటన వల్ల గ్రామాల్లో తీవ్ర అలజడి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పన పేరుతో నమ్మించి గతంలో మోసం చేశారని అన్నారు. ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి గాలికి వదిలేసారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభావిత గ్రామాలలో అభిప్రాయ సేకరణ పెట్టాల్సిన అధికారులు సింగరేణి అధికారులకు మాస్టర్లు వేసి శాంతిఖని గని పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆగ్రహం చెందారు.

సింగరేణి అధికారుల బిడ్డలు విదేశాలు స్థిరపడుతుంటే, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు మాత్రం నేటికీ గ్రామాల్లోనే జీవనం సాగిస్తున్నారన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. భవిష్యత్ తరాలకు భూమిని కాపాడుకోవాలని అన్నారు. సింగరేణి సంస్థకు రైతుల భూములను విధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. కేకే 5ని ఎందుకు మూసేస్తున్నారని, దీనిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వల్ల 16 వందల ఎకరాల వ్యవసాయ భూముల్లో విధ్వంసం జరుగుతుందని ఆయన అన్నారు. కన్నతల్లి లాంటి గ్రామాలను రైతులందరూ బతికించుకోవాలని, లాంగ్ వాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ఆకెనపల్లి గ్రామస్తుడు వై. పర్వతాలు మాట్లాడుతూ ప్రస్తుతం 500 మీటర్ల లోతులో కూడా బోర్లు పడని పరిస్థితి ఉందని, లింగాపూర్ శంకర చెరువు పూర్తిగా నీరింకి పోయిందని ఆవేదన చెందారు.

సామాజిక కార్యకర్త, తెలంగాణ రైతు సమాఖ్య నాయకులు మల్లయ్య మాట్లాడుతూ... లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల కూడా రైతులకు సాగు, త్రాగునీరు కరువవుతుందన్నారు. అన్నదాతలను నిర్వాసితులుగా చేసేందుకు సింగరేణి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. శాంతిఖని ప్రాజెక్టు వల్ల 20వేల మంది రైతులు అన్యాయమైపోతున్నారని అన్నారు. ప్రతి ఇంటికి సోలార్ థర్మల్ ప్లాంట్ పెట్టాలి తప్ప ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చి థర్మల్ ప్లాంట్స్ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. పల్లెలను పట్టించుకోకుండా గని విస్తరణ చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సింగరేణి చర్యల వల్ల పల్లెలన్నీ ధ్వంసం అవుతున్నాయని మండిపడ్డారు. విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలని కోరారు. ఐఎఫ్టియు నాయకులు చాంద్ పాషా మాట్లాడుతూ... ఓపెన్ కాస్ట్ గనిగా ప్రచారం చేసిన మందమరి జిఎం దేవేందర్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గతంలో భూగర్భ గనుల ప్రారంభించి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలని నిరదీశారు. కార్మిక కాలనీలకే సౌకర్యాలు కల్పించలేని సింగరేణి నిర్వాసిత గ్రామాలకు వసతులు ఎలా కల్పిస్తుందని నిలదీశారు. భూగర్భ గనులైన, ఓపెన్ కాస్ట్ గనులైనా నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం ఉండబోదన్నారు. సింగరేణి అనుభవిస్తున్న లాభాలన్నీ కాంట్రాక్టు కార్మికుల కడుపులు కొట్టినవి కాదా అని ప్రశ్నించారు. లింగాపూర్ గ్రామస్తులు కారు కూరి వెంకటేష్ మాట్లాడుతూ ఓసి చేస్తున్నామన్న ప్రకటనతో మూడు నెలలు రైతులు నిద్ర కూడా పోలేదన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు శాంతి ఖని గని ని ఓపెన్ కాస్ట్ చేయమని మీడియా సమావేశంలో స్పష్టం చేయాలని కోరారు. ఏఐటీయూసీ నాయకులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ... రైతులు ఆందోళన చేసేంత మాత్రాన శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఆగదని చెప్పడంతో రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం చేస్తూ నినాదాలు చేశారు.

చిప్ప నరసయ్య డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఆకెనపల్లి గ్రామస్తుడు రెడ్డి పోచం మాట్లాడుతూ.. లింగాపూర్, బుచ్చయ్యపల్లి, ఆకెనపల్లి గ్రామాలకు సింగరేణి అధికారులు చేసిందేమీ లేదని అన్నారు. శంకర్ చెరువుకు నీళ్లు అందిస్తామని మోసం చేశారన్నారు. రైతులు రాగం శెట్టి కుమార్, సబ్బని ముక్తేష్ సింగరేణి ప్రభావం వల్ల తమ కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. బట్వాన్ పల్లి గ్రామస్తులు చదువుల వెంకటరమణ మాట్లాడుతూ.. గోలేటి, మాదారం ప్రాంతాల్లో భూగర్భ గనులు ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి లాభం ఉండదని సూచించారు. పెరిక పల్లి గ్రామస్తుడు సంగతి సత్యనారాయణ మాట్లాడుతూ.. రైతు కుటుంబాలను భాగం చేసేందుకే ఈ ప్రాంతంలో అధికారులు లాంగ్ వాల్ గనిని విస్తరించే ఏర్పాట్లు చేస్తున్నారని మండిపడ్డారు. మామిడి తోటలను పూర్తిగా నష్టపోతున్నామని, ఈ ప్రాజెక్టును రైతులంతా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు.

సింగరేణి ఉద్యోగి కె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నలభై నాలుగు వేల మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థ భూగర్భ గనుల ఏర్పాటుకు కృషి చేయాలని సమావేశంలో కోరారు. అనంతరం అనేక మంది రైతులు లాంగ్ వాల్  ప్రాజెక్టు విస్తరణ వ్యతిరేకించారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ప్రాజెక్టుకు అనుకూలంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాగా ప్రభావిత గ్రామాలలో ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మందమర్రి జిఎం జి. దేవేందర్ స్పష్టం చేశారు.

రైతుల నుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని గ్రామాలలో త్రాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్యను తీరుస్తామన్నారు. పెద్ద చెరువుతోపాటు, శంకర చెరువుకు ప్రాజెక్టు నుండి నీటిని మళ్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రభావిత గ్రామాల్లో పళ్ళ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. రోడ్లు, సిసి డ్రైన్ లు, పాఠశాలలు ఏర్పాటు చేసే విధంగా సంస్థ సిఎండి దృష్టికి తీసుకెళ్తానన్నారు. సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణల దృష్టికి ప్రభావిత గ్రామాల సమస్యలను తీసుకెళ్లి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.