- బెంగాల్‌కు తప్పని ఓటమి
- క్వార్టర్స్‌లో హర్యానా, రాజస్థాన్
- వరుణ్ చక్రవర్తి పాంచ్ పటాకా
విజయ్ హజారే ట్రోఫీ
వడోదర: దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేస్తున్నా డు. టోర్నీలో భాగంగా గురువారం హర్యానాతో జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో బెంగా ల్ ఓటమి పాలైనప్పటికీ షమీ మాత్రం బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
నిషాంత్ సింధు (64), పార్థ్ వత్స్ (62) అర్థశతకాలతో మెరవగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో బెంగాల్ జట్టు 43.1 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటై పరాజయం చవిచూసింది.
ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (57), సుదీప్ కుమార్ (36) మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలమవ్వడంతో బెంగాల్‌కు ఓటమి తప్పలేదు. అయితే బెంగాల్ ఓడినప్పటికీ షమీ రాణించడం సానుకూలాంశం అని చెప్పొచ్చు. మరో రెండు రోజుల్లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించాల్సి ఉంది.
తన ఫిట్‌నెస్‌పై వస్తున్న సందేహాలను పటాపంచలు చేసిన షమీ అద్భుత ప్రదర్శనతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖా యంగా కనిపిస్తోంది. అన్నీ సక్రమంగా జరిగి షమీ ఎంపికైతే మాత్రం పేస్ బలగాన్ని తానే నడిపించాల్సి ఉంటుంది. ఎం దుకంటే వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా చాంపియన్స్ ట్రోఫీ ఆడడంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కూడా షమీని పరిగణలోకి తీసుకునే అవకాశముంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో షమీదే కీలకపాత్ర. 24 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత గాయం బారిన పడ్డ షమీ ఫిట్‌నెస్ తదితర కారణాలతో తిరిగి జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. అయితే వన్డే ప్రపంచకప్ అనంతరం టీమిండియా కూడా కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడింది.
శతకంతో మెరిసిన అభిజిత్..
ఇక రెండో ప్రిలిమినరీ క్వార్టర్స్‌లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో తమిళనాడుపై విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. అభిజిత్ తోమర్ (111) సెంచరీతో మెరవగా.. మహిపాల్ లామ్రోర్ (60) అర్థశతకంతో రాణించాడు. తమిళనాడు బౌలర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
అనంతరం తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకే పరిమితమైంది. నటరాజన్ జగదీశన్ (65) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విజయ్ శంకర్ (49) పర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్ అమన్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. శనివారం జరగనున్న క్వార్టర్స్‌లో మహారాష్ట్రతో పంజాబ్, కర్నాటకతో బరోడా తలపడనున్నాయి.