మలయాళ ఇండస్ట్రీలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ ఇటీవల తయారుచేసిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి పలువురు నటీమణులు బహిరంగంగా వెల్లడిస్తున్న వ్యాఖ్యలు ఇతర పరిశ్రమలకూ వ్యాపిస్తున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ నటి రితాభరీ చక్రవర్తి స్పందిస్తూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. “నాతో పాటు నాతోటి వారికి కొందరు నటులు, దర్శక నిర్మాతల చేతిలో భయానక అనుభవాలు ఎదురయ్యాయి.
ఇలా వేధింపులకు పాల్పడిన ఆ వ్యక్తులు.. బెంగాల్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగు తున్న నిరసనల్లో ఎలాంటి సిగ్గు లేకుండా పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక్కడ కూడా (బెంగాల్ ఫిల్మ్ ఇండస్ట్రీ) జస్టిస్ హేమ కమిటీ వంటి దానిని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలి. లైంగిక వేధింపుల కేసులపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని రాసుకొచ్చిందామె. ఈ పోస్టును నటి రితాభరీ చక్రవర్తి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ట్యాగ్ చేసింది.