calender_icon.png 11 January, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రద్దు చేద్దామా? లేకుంటే కొనసాగిద్దామా

04-12-2024 02:50:30 AM

* అదానీ డీల్ విషయంలో తర్జనభర్జనలు

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త సవాల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: సౌర విద్యుత్ విషయంలో గౌతమ్ అదానీకి చెందిన సంస్థ ముడుపులు చెల్లించి పనులు చేయించుకుందనే వార్త దేశం మొత్తాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని గత ప్రభుత్వం అదానీ సంస్థతో సోలార్ విద్యుత్‌కు సంబంధించి అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం అదానీ సంస్థల మీద ఆరోపణలు రావడంతో ఈ విషయం రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. 

ఏం చేద్దాం? 

గత ప్రభుత్వం అదానీ సంస్థతో 7 వేల మెగావాట్ల ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అవసరం అయితే అదానీ సంస్థకు జరిమానా చెల్లించైనా ఒప్పందం రద్దు చేసుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీతో గత ప్రభుత్వం కుమ్మక్కైందని వచ్చిన ఆరోపణలను స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు వినికిడి. ఈ ఒప్పందాన్ని కనుక రద్దు చేసుకుంటే వచ్చే పరిణామాల గురించి కూడా సీఎం ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)ని ఈ ఒప్పందం రద్దు చేయమని కోరడం ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్న ఆప్షన్‌గా తెలుస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ప్రతి ఒప్పందంలో ఉంటుంది. దానిని బట్టే ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందట. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘మేము సెకీతో విద్యుత్ ఒప్పందాన్ని విచారణలో పెండింగ్‌లో ఉంచుకోవచ్చు’ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వం యూనిట్‌కు రూ. 2.49 కి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇది ఆమోదయోగ్యమైన ఒప్పందం కాదని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ రేటుకు కస్టమర్ చార్జీలు, జీఎస్టీ కలుపుకుంటే యూనిట్‌కు రూ. 3.069 అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ రేటు చాలా ఎక్కువ అని వాదిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి రాబోయే 25 సంవత్సరాలలో రూ. 1.61 లక్షల కోట్లు అవుతుందని, ఇది అతి పెద్ద భారం అని పేర్కొంటోంది.