50 లక్షల ఎక్స్ గ్రేషియ ప్రకటించాలి
విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వాంకిడి ఆశ్రమ గిరిజన పాఠశాల విద్యార్థి శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లు, సాగు భూమి అందించాలని విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్పీ కరుణాకర్, సిఐ రవీందర్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించి భారికేట్లను ఏర్పాటు చేశారు. నాయకులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన నాయకులు శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని ఆశ్రమ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని వెంటనే విద్య శాఖ మంత్రి ఏర్పాటు చేయాలని, వాంకిడి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని దీనికి బాధ్యతగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని సస్పెండ్ చేయాలని, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.