ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాలీవుడ్ నటుల్లో స్టార్ హీరో షారుక్ ఖాన్ ఒకరు. తాజాగా ఆయన లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక పార్డో అల్లా కెరియరా పురస్కారాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డు ఆయన్ను వరించింది. అయితే, ఇలాంటి గౌరవాన్ని పొంది చరిత్ర సృష్టించిన తొలి భారతీయ నటుడిగా షారుక్ పేరు నిలిచిపోనుంది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో సందడి చేసిన షారుక్ అక్కడి అభిమానులతో ఇష్టాగోష్టిలో పాల్గొని సరదాగా గడిపారు.
ఈ సందర్భంగా ‘కుచ్ కుచ్ హోతా హై..’ పాటను అభిమానులు బృందగానం చేస్తుంటే షారుక్ వారితో గొంతు కలిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలా ఉండగా, వేడుక జరిగిన ప్రాంగణంలో మీడియాతో షారుక్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘నా గురించి తెలియకపోతే గూగుల్‌ను అడగండి. అది ఏం చెప్తుందో విని నన్ను ప్రశ్నలు అడగండి’ అని షారుక్ సరదాగా అన్నారు. షారుక్ ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గూగుల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించింది. మీరు కింగ్ అనే అర్థం వచ్చేలా కిరీటం ఎమోజీని పోస్ట్ చేసి షారుక్‌ను ట్యాగ్ చేయడం విశేషం.
సౌత్ ఇండస్ట్రీ ఎప్పుడూ ప్రత్యేకమే
ఈ వేడకలో షారుక్ మాట్లాడుతూ.. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆకాశానికెత్తారు. ‘సౌత్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులున్నారు. గొప్ప కథలను తెరకెక్కిస్తున్నారు. భారతీయ సినిమా రంగంలో గొప్ప సూపర్ స్టార్లు చాలా మంది సౌత్ నుంచి వచ్చినవారే. అక్కడి వారితో కలిసి నేనూ పనిచేశా. ఎక్కువ మంది దర్శకులతో కలిసి వర్క్ చేయాలన్న ఆసక్తితో ఉన్నాను. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీ ఎప్పుడూ ప్రత్యేకమే మణిరత్నం దర్శకత్వంలో ‘దిల్‌సే’లో నటించా. ఇంతకు మించి ఇంకేం కావాలి. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘జవాన్’ వంటి చిత్రాలు ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించడంలోనూ దక్షిణాది పరిశ్రమ ముందుంటుంది’ అని ప్రశంసలు కురిపించారాయన.