కొన్ని సినిమాల ఎండింగ్ ప్రేక్షకులకు నచ్చదు. సినిమా సక్సెస్‌పై ఈ ఎండింగ్ కూడా ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని సార్లు సినిమాలో నటించిన ప్రధాన తారాగణానికి సైతం ఎండింగ్ నచ్చకపోవచ్చు. కానీ అది సూపర్ హిట్ అయితే ఆ ఆనందమే వేరు. షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాల జంటగా నటించిన చిత్రం ‘దిల్ సే’. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1998 అస్సాం తిరుగుబాటు నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమతో’ అనే టైటిల్‌తో విడుదల చేశారు.
ఈ సినిమానే కాదు.. పాటలు సైతం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఛయ్యా.. ఛయ్యా‘ పాట మాస్ ఆడియాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. రన్నింగ్ ట్రైన్‌పై ఈ పాట తీశారు. ‘జియా జిలే జాన్ ఛలే’ పాట క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మనీషా టెర్రరిస్టుగానూ.. ఆత్మహుతి బాంబర్‌గానూ నటించారు. షారుఖ్ ఖాన్ ఆల్ ఇండియా రేడియో ఉద్యోగి అయిన అమర్ కాంత్ వర్మ పాత్రలో మెప్పించారు. ఎండింగ్‌లో మనీషా, షారుఖ్ ఇద్దరూ చనిపోతారు. ఈ ఎండింగ్ షారుఖ్‌కు అస్సలు నచ్చలేదట.
ఈ విషయాన్ని మనీషా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. “నేను రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే మణిరత్నం ‘దిల్ సే’ కథ నాకు వివరించారు. నేను ఆ చిత్రంలో టెర్రరిస్ట్ పాత్ర పోషించాలని తెలుపగానే నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఆ తరువాత నాకు నెగెటివ్ పాత్రలో నటించేందుకు వచ్చిన మంచి అవకాశం గా భావించి నటించాను. అయితే నేను అంగీరించిన అసలు కథ వేరే ఉంది. ఈ కథ ముగింపు చివరి నిమిషంలో మార్చడం జరిగింది.
అసలు స్క్రిప్ట్‌లో షారుఖ్ చనిపోవడానికి ఇష్టపడలేదు. కానీ స్క్రిప్ట్ మార్చేయడంతో షారుఖ్, నేను మరణిస్తాం” అని మనీషా వెల్లడిచారు. మనీషా ఆత్మాహుతి దాడికి వెళుతుండటం.. షారుఖ్ అడ్డుకుని తన ప్రేమను అంగీకరించమని కోరడం ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సీన్ అంతలోనే బాంబ్ పేలి ఇద్దరూ మరణించడం జరుగుతుంది. షారుఖ్‌కి నచ్చకున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.