10-04-2025 10:18:07 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీ రావులపల్లి గ్రామంలో గురువారం మహిళా సమైక్య ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల రైతులు వినియోగించుకోవాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని, పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకొని మద్దతు ధర పొందాలని అన్నారు. సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు కలుగనీయకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులకు గన్ని సంచుల కొరత, ఇతరత్రా సమస్యలు లేకుండా ప్రభుత్వం చూస్తుంది అన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.