calender_icon.png 12 October, 2024 | 12:54 AM

శభాష్.. క్యూఆర్ టీం

04-09-2024 12:05:52 AM

గుండవాగులో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన టీం సభ్యులు

అభినందించిన ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి

మెదక్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): వరదలో చిక్కుకున్న వ్యక్తిని క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్‌టీ) ప్రాణాలకు తెగించి కాపాడింది. మెదక్ జిల్లా టేక్మాల్ సమీపంలోని గుండువాగు భారీ వర్షాల వల్ల బ్రిడ్జి పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం టేక్మాల్ మండలానికి చెందిన రమావత్ నందు గుండువాగులో చేపలు పట్టడానికి వెళ్లాడు. వరద తీవ్రంగా ఉండటంతో వాగులో దిగిన నందు నీళ్లలో పడి కొట్టుకుపోతుండగా ప్రవాహంలోనే ఓ బండరాయిని పట్టుకొని ఆగిపోయాడు.

సమాచారం అందుకున్న క్విక్ రెస్పాన్స్ టీం సభ్యుడు మహేష్ వెంటనే మరో ఇద్దరు యువకులతో తాడు సహాయంతో ప్రవాహంలోకి దిగి నందును వరద ప్రవాహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన మహేశ్‌తో పాటు టీం సభ్యులను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి అభినందించారు.