24 గంటల్లోనే రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఇనుప సామాను అమ్ముకునే యువకుడే సూత్రధారిగా గుర్తింపు
బంగారు ఆభరణాల రికవరీ, నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడించిన డీసీపీ సీహెచ్ శ్రీనివాస్
రాజేంద్రనగర్, జూలై10 (విజయక్రాంతి): ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రవిబాబు ఇంట్లో జరిగిన చోరీ మిస్టరీని నార్సింగి పోలీసులు ఛేదించారు. 100 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని కటకటాల వెనక్కి పంపించారు. రాజేంద్రనగర్ లోని తన కార్యాలయంలో డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ బుధవారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ గంధంగూడలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రవిబాబు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈనెల 3వ తేదీన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లారు. 9వ తేదీ ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం విరిగిపోయి ఉంది.
లోపలికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గ్రహించారు. బీరువాలో దాచిఉంచిన 100 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి టెక్నికల్ ఆధారాల ద్వారా కేసు విచారణను ప్రారంభించారు. ఈ క్రమంలో గంధంగూడ ఆర్‌జీకే ప్రాం తంలో ఉంటూ ఇనుప సామగ్రి సేకరించే ప్రవీణ్ ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. ఈమేరకు అతడి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును 24 గంటల్లోనే చేధించిన నార్సింగి పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించి వారికి క్యాష్ రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ విజయ్‌కుమార్ నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి, ఎస్‌ఐ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.