23-02-2025 12:50:34 AM
షబానా ఆజ్మీ.. భారతీయ సినీరంగంలో తనదైన ముద్ర వేసిన నటీమణుల్లో ఈమె కూడా ఒకరు.. ఫెమినిస్ట్, చురుకైన సోషల్ యాక్టివిస్ట్. అందమైన ముఖ వర్చస్సు.. అంతే ఆకట్టుకునే నటనతో 70ల్లో ప్రేక్షక లోకాన్ని అమితంగా ఆకట్టుకుంది. 160కి పైగా చిత్రాల్లో నటించింది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేది. విదేశీ చిత్రాల్లోనూ రాణించిన ఘనత ఆమెకే సొంతం. షబానా నటించిన ఎన్నో చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రదర్శించబడ్డాయి.
షబానా తొలి చిత్రం ‘పరిణయ్’. కానీ ఆమె చిత్రాల్లో మొదటగా విడుదలైంది మాత్రం శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన ‘అంకుర్ (1974). హైదరా బాద్‌లో జరిగిన నిజమైన కథ ఆధారంగా అంకుర్ రూపొందింది. ఈ చిత్రానికి పలువురు ప్రముఖ నటీమణులను సంప్రదించ గా వారు నిరాకరించడంతో షబానాకు అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా.. ‘ఆర్థ్, ఖందర్, పార్, గాడ్ మదర్, మండి’ చిత్రాల్లో నటించారు. ‘మండి’ చిత్రంలో వేశ్యా గృహాన్ని నడిపే వ్యక్తిగా షబానా నటించారు.
లిప్‌లాక్ సీన్ కోసం..
2023లో షబానా ఆజ్మీ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ధర్మేంద్రతో షబానాకు ఒక లిప్‌లాక్ సీన్ ఉంటుంది. కానీ లిప్ లాక్ సీన్ గురించి విన్న తర్వాత తన భర్త పర్మిషన్ తీసుకుని చెబుతానన్నారట. తన భర్తను ఈ విషయమై అడగ్గా.. ‘ఇది చాలా చిన్న విషయం.. దీనికోసం తన పర్మిషన్ ఎందుకు?’ అన్నారట. మొత్తానికి ఆ చిత్రంలో షబానా నటించారు. ఆ సినిమా విడుదలైన తర్వాత తనకు ఎన్నో ఫోన్‌లు, మెసేజ్‌లు వచ్చాయని షబానా తెలిపారు.
ఎప్పటికీ అదొక లోటుగానే..
ఏ స్త్రీ అయినా జీవితంలో మాతృత్వమనేది గొప్ప వరంగా భావిస్తూ ఉంటుంది. కానీ షబానాకు ఈ విషయంలో నిరాశే ఎదురైంది. ఆమె భర్త జావేద్ అక్తర్‌కు అంతకు ముందు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. కానీ అక్తర్, షబానా దంపతులకు మాత్రం సంతానం కలుగలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా షబానా తన జీవితంలోని ఈ లోటును గుర్తు చేసుకున్నారు.
సమాజం పిల్లలు లేని మహిళ జీవితాన్ని అసంపూర్తిగా పరిగణిస్తూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఫెమినిజం గురించి ఆమె చెప్పిన నిర్వచనం వింటే ఆశ్చర్యమేస్తుంది. ‘ప్రపంచం అనాదిగా ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని పురుషుని దృష్టి కోణం నుంచే వెదుకుతూ ఉంటుంది. అలా కాకుండా స్త్రీ వైపు నుంచి కూడా ఆలోచించడమే ఫెమినిజం’ అని షబానా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నిశ్చితార్థం రద్దుంది..
షబానా ఆజ్మీ 18 సెప్టెంబర్ 1950న హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి కవి కాగా.. తల్లి రంగస్థల నటి. సోదరుడు సినిమాటోగ్రాఫర్, వదిన కూడా నటి. 1970 చివరిలో బెంజిమిన్ గిలానీతో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఏమైందో కానీ ఆ తరువాత కొద్ది రోజులకే నిశ్చితార్థం రద్దుంది. ఆ తరువాత షబానా.. హిందీ చిత్రాల్లో గీత రచయిత, కవి, స్క్రిప్ట్ రచయిత అయిన జావేద్ అక్తర్‌ను వివాహం చేసుకున్నారు.