calender_icon.png 15 January, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ మహిళపై లైంగికదాడి?

05-09-2024 12:32:52 AM

  1. ఆపై కొట్టి రోడ్డు పక్కన పడేసిన వైనం 
  2. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 
  3. ఆలస్యంగా వెలుగులోకి ఘటన 
  4. జైనూర్ బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీలు 
  5. జైనూర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఆదివాసి మహిళపై లైంగిక దాడికి యత్నించగా.. ఆమె ప్రతిఘటించడంతో కొట్టి, చనిపోయిందనుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి రాగా.. బుధవారం ఆదివాసీలు జైనూర్ మండల బంద్‌కు పిలుపునిచ్చారు. గత నెల 31న జైనూరుకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ మగ్ధూం ఓ ఆదివాసి మహిళపై లైంగిక దాడి కి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇనుపరాడ్డుతో ముఖంపై దాడి చేయడంతో స్పృహ కోల్పోయింది.

చనిపోయిందనుకుని నిర్ధారించుకున్న నిందితుడు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మహిళను జైనూర్ మండలంలోని దోవుగూడ సమీపంలో రోడ్డు పక్కన పడేసి పారిపోయాడు. అదేరోజు రాత్రి అటుగా మరో ఆటోలో వెళ్తున్న ఆదివాసీలు రోడ్డు పక్కన పడివున్న మహిళను గమనించి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా నిందితుడు షేక్ మగ్ధూంను అదుపులో కి తీసుకుని, ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ, లైంగికదాడి, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ సదయ్య తెలిపారు.

ఉద్రిక్తతకు దారితీసిన బంద్

లైంగిక దాడి జరిగినట్లు తెలియడంతో ఆదివాసి సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. నిందితుడిని శిక్షించాలని కోరుతూ బుధవారం జైనూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు దుకాణాలు, మసీదులపై దాడులు చేశారు. నిందితుడి ఇంటితో పాటు పలు దుకాణ సముదాయాలు, సామగ్రికి నిప్పంటించారు. బైక్‌లు, కార్లు, ఇండ్ల ముందున్న ఉన్న సామగ్రిని ధ్వంసం చేశారు.

దీంతో ఆదివాసీలు, ముస్లింల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ప్రతిదాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు జైనూర్‌లో 144 సెక్షన్‌ను అమలు చేయడంతో పాటు పోలీస్ బలగాలను మోహరించారు. అల్లర్లు జరుగకుండా ఎస్పీ డీవీ శ్రీనివాస్ నేతృత్వంలో ఏఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ సదయ్య పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీయవద్దని మీడియాకు ఆంక్షలు విధించారు.

సంయమనం పాటించాలి: కలెక్టర్

సంయమనం పాటించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జైనూర్ మండలంలో జరిగిన అల్లర్లపై కలెక్టర్ స్పందించారు. నిందితుడికి చట్ట పరంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అల్లర్లకు పాల్పడకుండా ఇరువర్గాల ప్రజలు సమన్వయం పాటించాలని కోరారు.

కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే

ఆదివాసి మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో బాధిత మహిళను బుధవారం ఆమె పరామర్శించారు. ఏజెన్సీ ప్రాం తంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

డీజీపీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్

ఆదివాసీ మహిళపై లైంగిక దాడి అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేశారు. నిందితుడు షేక్ మగ్ధూంకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

అండగా ఉంటాం: సీతక్క

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధిత మహిళను మంత్రి సీతక్క పరామర్శించారు. మహిళ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నా రు. నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందు కు చర్యలు తీసుకుంటామన్నారు. ఏజె న్సీ ప్రాంతాల్లో ఇటువంటి సంఘటన లు పునరావృతం కాకుండా కట్టుదిట్టమై న చర్యలు తీసుకుంటామని తెలిపారు.