calender_icon.png 3 April, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్మనీ యువతిపై లైంగిక దాడి!

02-04-2025 12:57:17 AM

  1. హైదరాబాద్‌లో స్నేహితుడితో కలిసి మార్కెట్‌కు బయలుదేరిన యువతి
  2. లిఫ్ట్ ఇస్తానని నమ్మించి దారుణానికి ఒడిగట్టిన కారు డ్రైవర్
  3. కారులో నుంచి కిందకు దూకి పోలీసులను ఆశ్రయించిన యువతి
  4. పోలీసుల అదుపులో నిందితుడు

హైదరాబాద్, ఏప్రిల్ ౧ (విజయక్రాంతి)/మహేశ్వరం: జర్మనీ దేశానికి చెందిన యువతిపై ఓ కారు డ్రైవర్ లైంగికదాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌కు చెందిన శ్రీమంగళగిరి శరత్‌చంద్రచౌదరి 2024లో ఇటలీలోని మెస్సినా విశ్వవిద్యాలయంలో డేటా అనాలిటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలో చేరాడు. అక్కడ జర్మనీ విద్యార్థినితో శరత్‌చంద్రకు స్నేహం ఏర్పడింది.

ఆ స్నేహం కారణంగా జర్మనీ యువతి ఇండియాలో ప్రసిద్ధి చెందిన కట్టడాలు, నిర్మాణాలతో పాటు ఇక్కడి సంప్రదాయాలను తెలుసుకునేందుకని మార్చి 4న హైదరాబాద్‌లోని శరత్‌చంద్రచౌదరి ఇంటికి వచ్చింది. శరత్‌చంద్రతో కలిసి ప్రతిరోజు పలు ప్రాంతాలను సందర్శిస్తున్నది. ఈ క్రమంలోనే సోమవా రం సాయంత్రం కూరగాయల మార్కెట్‌కు శరత్‌చంద్రతో కలిసి బయలుదేరింది.

మార్గమధ్యంలో యాకుత్‌పురా ఎస్‌ఆర్‌టీ కాలనీకి చెందిన డ్రైవర్ మొహమ్మద్ అబ్దుల్ అస్లాం(25) కారులో వచ్చాడు. అప్పటికే కారులో ఆరుగురు మైనర్ బాలురు ఉన్నా రు. వీరంతా తొమ్మిది నుంచి 16 ఏళ్ల లోపు వారు. జర్మనీ యువతిని అస్లాం ఎక్కడికి వెళ్తున్నారంటూ ఆప్యాయంగా పలకరించి, లిఫ్ట్ ఇస్తానని నమ్మించాడు. దీంతో యువతితో పాటు ఆమె స్నేహితుడు కారులో కూ ర్చున్నారు.

కారును చంద్రాయణగుట్ట వైపు తీసుకెళ్లిన అస్లాం పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించి, పలు ప్రాంతాల్లో తిప్పుతూ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడిపల్లికి తీసుకెళ్లాడు. మైనర్లను ఫోన్‌లో సెల్ఫీలు దిగమన్న అస్లాం.. శరత్‌చంద్రతోపాటు కారులో నుంచి వారిని కిందకు దించాడు. కారులో ఒంటరిగా ఉన్న యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అనంతరం యువతితో సహా మైనర్ల వద్దకు కారులో వచ్చి, వారిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుండగా యువతి బయటకు దూకింది. పోలీసులను ఆశ్రయించి, అస్లాం అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా గతంలో నిందితుడు దుబాయ్‌లో కారు డ్రై వర్‌గా పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువతిపై అత్యాచారం చేయాలనే ఉద్దేశంతోనే లిఫ్ట్ ఇచ్చాడని విచారణలో వెల్లడైంది. 

నిందితులను కఠినంగా శిక్షించాలి: మహిళా మోర్చా 

మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై బీజేపీ రాష్ర్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన అత్యాచార ఘటన,  హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై లైంగిక ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంగళవారం జర్మనీ యువతిని ఆమె పరామర్శించారు. పోలీసు అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిందితులను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.