calender_icon.png 29 December, 2024 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళపై లైంగికదాడి

29-12-2024 02:02:52 AM

* భర్తతో గొడవపడి బయటికి వచ్చిన వివాహిత

* డబ్బులు కావాలని బస్టాండ్‌లో ఓ వ్యక్తిని అడిగిన బాధితురాలు 

* ఇప్పిస్తానని చెప్పి మరో వ్యక్తితో లాడ్జికి పంపిన సదరు వ్యక్తి 

* లాడ్జిలో మహిళపై అఘాయిత్యం 

* నిర్మల్ జిల్లాకేంద్రంలో కలకలం

నిర్మల్, డిసెంబర్ ౨౮ (విజయక్రాంతి): భర్తతో గొడవపడి ఇంట్లోంచి బయటికి వచ్చిన ఓ వివాహితపై లైంగికదాడి జరిగిన ఘటన నిర్మల్ జిల్లాకేంద్రంలో శనివారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహిత శుక్రవారం భర్తతో గొడవపడి ఇల్లు వదిలి బయటికి వచ్చింది. అనంతరం నిర్మల్ బస్టాండ్‌కు చేరుకున్నది. ఒంటరిగా ఉన్న సదరు మహిళను యోగేశ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.

తాను ఇంట్లో గొడవపడి వచ్చానని, తనకు కొంత డబ్బు కావాలని అతడిని అడిగింది. తన వద్ద లేవని యోగేశ్ చెప్పగా, ఎవరి వద్దయినా ఇప్పించండి అని కోరింది. దీంతో అతను కళ్యాణ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తను డబ్బులు ఇస్తానని చెప్పి బాధితురాలిని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావించి అక్కడే వదిలేసి నిందితుడు పారిపోయాడు. అనంతరం ఆమె లాడ్జి నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కి కుప్పకూలిపోవడంతో ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకీ షర్మిల, పట్టణ సీఐ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. బాధితురాలి సమాచారం మేరకు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమరాలను ఎస్పీ పరిశీలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.