హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): సినిమాల్లో అవకాశం కల్పిస్తామని ఓ మహిళను నమ్మించిన దుండగుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటూ హౌస్‌కీపింగ్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. 15 రోజుల క్రితం అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో చేరి సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నం చేసేందుకుగాను కృష్ణానగర్‌లోని తెలిసినవారిని వాకబు చేస్తుండగా.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది.
ఆడిషన్స్ ఉన్నాయంటూ 3 రోజుల క్రితం కృష్ణానగర్‌లోని ఓ హోటల్‌కు పిలిచి మొదటి రోజు ఫోటోషూట్ చేసి మరుసటి రోజు రావాలని కాటేకొండ రాజు ఆమెతో చెప్పాడు. రెండోరోజు వెళ్లిన తర్వాత ఆమెపట్ల రాజు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగికదాడికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.