calender_icon.png 29 April, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాకాలంలోపు మురుగునీటి పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలి

29-04-2025 12:47:25 AM

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, ఏప్రిల్ 28 ( విజయక్రాంతి ): ఖమ్మం నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులలో భాగంగా మురుగు నీటి పైప్ లైన్ పనులు రాబోయే వర్షాకాలం లోగా పూర్తిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మంత్రి, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి స్థానిక బైపాస్ రోడ్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం క్రింద దాదాపు 189 కోట్ల 50 లక్షలతో  చేపట్టిన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ పనులు నిర్మాణంలో ఉన్నాయని, ఈ పథకంలో బాగంగా ఖానాపురం ఊర చెరువు నుండి థంసలాపురం చెరువు  వరకు 9.6 కిలో మీటర్  ల మురుగు  నీటి పైప్ లైన్  నిర్మించి, అంతర్గత పైప్ లైన్లను అనుసంధానం చేసి మురుగునీటి శుద్ధి కేంద్రంకు తరలిస్తామని అన్నారు.థంసలాపురం లో 44 మిలియన్ లీటర్ ల సామర్ధ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం, పుట్టకోట లో 9.5 మిలియన్ లీటర్ ల సామర్ధ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించి శుద్ధి చేస్తారన్నారు. 

వర్షా కాలం వచ్చే లోపు వర్షపు నీటి కాలువ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.యు.జి.డి. పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు వచ్చాయనే అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు నెలల్లో సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి కావాలని,  వర్షాకాలంలోపు పూర్తి అయ్యేలా కార్యాచరణ చేసి పనులు చేయాలని అన్నారు. అనంతరం వైరా రోడ్ లోని యూజీడిని సందర్శించి ఎన్ని రోజులలో పనులు పూర్తి చేయగలుగుతాము అనే విషయమై పూర్తి నివేదిక తనకు ఇవ్వాలని అధికారులని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ రంజిత్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.