17-02-2025 11:43:23 PM
పనులను పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి..
ఆటంకం కలుగకుండా పనులు చేపట్టాలని సూచన..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): కోర్ సిటీలో మురుగు నీటి వ్యవస్థ ఆధునీకరణ కోసం జలమండలి చేపట్టిన జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనులను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహిద్దీన్ తో కలిసి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. సోమవారం సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పనులను పరిశీలించిన ఆయన ఆటంకం కలుగకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. టోలిచౌకి ఫ్లు ఓవర్ ప్రధాన రహదారిలో చేపట్టే జంక్షన్ పనులను ఆటంకాలు కాకుండా ఎలా చేపట్టాలో అధికారులతో చర్చించారు. ఇక్కడ ప్రధాన రహదారిపై వివిధ మతాల కట్టడాలు, లేబర్ అడ్డా ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రద్దీ లేని సమయాల్లో, సెలవు రోజుల్లో దాదాపు 8 నుంచి 11 మీటర్లు లోతులో జరిగే టన్నెలింగ్ పనులను నిర్వహించాలని సూచించారు. టన్నెలింగ్ పనులు చేపట్టేటప్పుడు జీహెఎంసీ, ట్రాన్స్ కో, జలమండలి ట్రాన్స్ మిషన్, ఓ అండ్ ఎం అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
అక్కడక్కడ ట్రయల్ పిట్ ఏర్పాటు చేసుకుని భూగర్భంలో ఏవైనా పైపు లైన్లు, కేబుళ్లు ఉన్నాయోలేవో అంచనా వేసుకుని వాటికి ఆటంకం కాకుండా పనులు నిర్వహించాలని సూచించారు. పనులు చేపట్టే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం 7 టూంబ్స్ వెళ్లే రహదారిలో అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ పనులను ఎండీ పరిశీలించారు. మార్చి మొదటి వారం వరకు పూర్తయ్యేలా రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టి వేగంగా చేయాలని ఆదేశించారు. అనంతరం ఎండీ లైన్స్, గుడిమల్కాపూర్, గిరకపల్లి తదితర ప్రాంతాల్లో పురోగతిలో ఉన్న పైపులైన్ విస్తరణ పనుల్ని పరిశీలించారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఇబ్బంది కలగకుండా.. పనులు చేపట్టి మే వరకు పూర్తి చేయాలని ఎండీ అశోక్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సీజీఎం రాజేందర్, జీఎం కుమార్, ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సీవరేజీ వ్యవస్థ ఆధునీకరణ కోసం.. జోన్ 3 సీవరేజ్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్
మూసీనదికి ఉత్తరం వైపున కోర్ సిటీలో సీవరేజి వ్యవస్థ ఆధునికీకరణ కోసం జోన్ - 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులను జలమండలి చేపడుతోంది. 4 నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణానికి సంబంధించి రూ.297 కోట్ల వ్యయంతో జోన్ - 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టులో మొత్తం 135 కిలోమీటర్ల పొడవైన పైప్లున్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతోంది. నగరంలోని ఓల్డ్ సిటీలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజి వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ ప్రాజెక్టు చేపట్టింది. టోలిచౌకి, గోల్కొండ, లంగరౌజ్, సెవెన్ టూంబ్స్, జూబ్లీహిల్స్(కొంత భాగం), మెహదీపట్నం, నానల్నగర్, ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీ, ఎన్‌ఎండీసీ కాలనీ, మాసబ్ ట్యాంక్, రెడ్ హిల్స్, లక్డీకపూల్, బజార్ఘాట్, నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్, తదితర ప్రాంతాలు. మొత్తం పైపులైన్ పొడవు 135 కిలో మీటర్లు కాగా.. ఇప్పటి వరకు 120 కిలో మీటర్ల మేర నిర్మాణం పూర్తయింది.
ఇందులో 9.5 కిలో మీటర్ల మేర 200,-300 డయా పైపు లైన్ పనులు, 6.5 ట్రంక్ మెయిన్లు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. 10 ప్రాంతాల్లో 1.2 కిలో మీటర్లు టన్నెలింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల నుంచి 100 శాతం మురుగునీటి సేకరణ జరుగుతుంది. నాలాల్లోకి, మూసీ నదిలోకి నేరుగా మురుగునీటి ప్రవాహం ఉండదు. దీంతో ఈ ప్రాంతంలో మెరుగైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది.