భారీ వర్షాలు పడ్డప్పుడల్లా హైదరాబాద్ నగరంలోని దాదాపు 40 శాతం రోడ్లపైకి మురుగు నీరు వచ్చి చేరి, ప్రవాహం వలె మారుతున్నది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోష్ లొకాలిటీ, గ్రీన్ ఛాలెంజిలో ఉత్తమ కాలనీగా గుర్తింపు పొందిన ప్రాంతాలు సైతం ఇలా డ్రైనేజీ దుర్వాసనతో నిండి పోతుండడం బాధాకరం. నలభై ఏళ్ల క్రితం వేసిన పైపు లైన్లపైన చెట్లు పెరిగాయి. వాటి వేర్లవల్ల పైప్ లైన్స్ ధ్వంసమైన ఆనవాళ్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. పెద్ద భవంతులు వున్న విశాలమైన రోడ్లపైకి మురుగు నీరు అదే పనిగా ప్రవహించడం సహజమై పోయింది. సామజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టినా జీహెచ్‌ఎంసీ, స్యూవరేజ్ బోర్డు అధికారులకు చలనం కలగడం లేదు.
బీయన్ రెడ్డి, బీడి గార్డెన్స్, చైతన్యపురి, కర్మన్‌ఘాట్ ప్రాంతాలవద్ద మోకాలి లోతులో నీరు పారుతుంటాయి. మ్యాన్ హోల్స్ ధ్వంసమై రోడ్లు గుంతలుగా మారుతాయి. అధికారులు నాలుగు కర్రలు నాటి, ప్లాస్టిక్ బాక్సులు పెట్టి హెచ్చరిక బోర్డు పెడుతున్నారు. శాశ్వత పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చేద్దామన్న స్పృహ స్థానిక నాయకులు, కార్పొరేటర్లకు లేకుండా పోయింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత డ్రైనేజీ పైపు లైన్‌ల సామర్థ్యం సరిపోవడం లేదన్నది స్పష్టం. మురుగు నీటివల్ల దుర్వాసన, ఈగలు, దోమలు, క్రిములు వృద్ధి చెందుతుండడంతో ప్రజారోగ్యానికి ప్రమాదం ఏర్పడుతున్నది.
డా. ఏ. ప్రణయనాథ్ రెడ్డి,
బి.ఏన్ రెడ్డి కాలనీ