calender_icon.png 23 March, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం..

22-03-2025 06:38:58 PM

ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బయ్య అభిమన్యు..

టేకులపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బయ్య అభిమన్యు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.57% ఇది గత బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ కంటే స్వల్పంగా(0.2%) పెంచిందని ప్రకటించారు. గత బడ్జెట్లో విద్యారంగానికి 21,292 కోట్ల రూపాయలు కేటాయించింది. అది ప్రస్తుతం 23,108 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్య ఏ మాత్రం అభివృద్ధి కాదని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పినది. కానీ దాని ఊసు ఈ బడ్జెట్లో లేదు. ప్రతి రెండు గ్రామాలకు ఒక గురుకులం అని అన్నారు. దాని గురించి చర్చే లేదు. యూనివర్శిటీల అభివృద్ధి రాష్ట్రంలో 450 కోట్లతో ఎలా సాధ్యం అవుతుంది అని అన్నారు. 

వీటిలో ఉస్మానియా యూనివర్సిటీకి (100 కోట్లు), మహిళా యూనివర్సిటీ(550 కోట్లు), కాకతీయ (50కోట్లు), డా బి ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (25 కోట్లు), పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ, తెలంగాణ, మహాత్మగాంధీ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీలకు (35 కోట్లు) చొప్పున కేటాయించారు. ఈ నిధులతో యూనివర్శీటీల నిర్వహణ మినహా అభివృద్ధికి యూనివర్శిటీలు నోచుకోవు. ప్రజా ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ ఈ నిధులతో ఎలా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తుందో తెలపాలని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో గత బిఆర్ఎస్ పాలనలో యూనివర్శీటీలు దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్, భవనాలు, ఖాళీల భర్తీ, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి యూనివర్శీటీకి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. ఉస్మానియాకు 1000కోట్లు, మహిళ యూనివర్శీటీ అభివృద్ధి కోసం. 1000 కోట్లు నిధులు నిర్వహణ కోసం, బాసర ఐఐఐటి అభివృద్ధి, అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో నూతన యూనివర్శీటీలు కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ యూనివర్శీటీలు అభివృద్ధి కోసం మొత్తం ఈ బడ్జెట్లో 450కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. 

రాష్ట్రంలో ఉన్న 11 రాష్ట్ర యూనివర్శీటీలకు కనీసం నిర్వహణకు కూడా నిధులురావు. ఒక్క ఉస్మానియా యూనిర్శీటీకే 350 కోట్లు పైగా నిర్వహణకు అవసరం. కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జెఎన్టీయుహెచ్, ఫైన్ ఆర్ట్స్, మహిళా యూనివర్శీటీ, అగ్రికల్చర్ యూనివర్శీటీ, వెటర్నరీ, హర్టీకల్చర్ లాంటి వాటికి నిధులు కేటాయింపులు లేవు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రకారం బాసర ఐఐఐటిల లాగా మరో రెండు కేటాయిస్తామని చెప్పి వాటి గురించి కూడా ప్రస్థావన లేదు. పాఠశాల విద్యారంగ లో ఖాళీలు భర్తీ, మధ్యాహ్న భోజనం నిధులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, నూతన భవనాలు, లైబ్రరీ, ముత్రశాలలు, మౌళిక సదుపాయాలు కోసం ఈ నిధులు సరిపోవని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది. గురుకులాలు నిర్మాణం కోసం కూడా కనీస నిధులు లేవు. ఇప్పటికే రాష్ట్రంలో 662 పైగా గురుకులాలకు స్వంత భవనాలు లేవని, ఉన్న గురుకులాలు కూడా సరైన మౌళిక సదుపాయాలు లేవు.

స్వయంగా భట్టి విక్రమార్క ప్రకటించారు. కానీ వీటి అభివృద్ధి కోసం మాత్రం ఎలాంటి నిధులు ఇవ్వలేదు. 40% డైట్ ఛార్జీలు పెంచామని ఘనంగా చెబుతున్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మాత్రం అసలు ఈ మెనూ అమలు చేయడం లేదని అన్నారు. ఈబడ్జెట్లో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ 8,258 వేల కోట్ల పైగా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి విడుదల కోసం నిధులు కేటాయించలేదు.  ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా 15 % పైగా నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి 7.57% నిధులు మాత్రమే కేటాయించారు. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల హామీ కూడా ఎలాంటి చర్చ లేదు. తక్షణమే బడ్జెట్ సవరించి విద్యారంగానికి నిధులను పెంచి ప్రభుత్వ విద్యారంగాని అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.