22-03-2025 04:34:18 PM
బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్..
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్ విమర్శించారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ నియామకాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికి ఆ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉండగా కేవలం 11 వేల కోట్లు మాత్రమే కేటాయించి ఏ ప్రాతిపదికన బీసీలకు న్యాయం చేస్తారో స్పష్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లే బడ్జెట్లో కూడా 42 శాతం కేటాయింపులు చేయాలన్నారు. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జనాభాకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఆయన కోరారు.