మరింత ఎండల తీవ్రత..
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 24 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు తీవ్ర ఎండలు ఉండే పరిస్థితుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇటీవల నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45.7C నమోదు అయ్యిందని, ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతల అంచనాల మేరకు వాతావరణ శాఖ జిల్లాల వారీగా హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 45ఓC పైగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రెడ్ అలెర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు.
తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం, నిమ్మరసం వంటి ద్రవాలు తరచూ తీసుకోవాలన్నారు. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోవాలని, వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య సేవలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.






