22-03-2025 08:36:27 PM
వడగండ్ల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం..
అకాల వర్షంతో తెల్లజోన్నకు భారీ నష్టం..
సంగారెడ్డి (విజయక్రాంతి): అకాల వర్షంతో పంటలకు, మామిడి తోటలకు అపార నష్టం జరిగింది. శుక్రవారం రాత్రి నుంచి ఈదురు గాలులతో వర్షం కురవడంతో రైతులు సాగు చేస్తున్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. భారీగా గాలి, వానతో చేతికొచ్చిన పంటలు నేలమట్టం కావడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. రైతులు సాగుచేసిన తెల్ల జొన్న పంట వర్షాలకు నేలమట్టం కావడంతో తీవ్ర నష్టం జరిగింది. మామిడి తోటలకు గాలి వానతో మామిడికాయలు రాలిపోవడంతో నష్టం వాటిల్లింది. వడగండ్ల వాన కురవడంతో పంటలకు భారీగానే నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, నియోజకవర్గంలో పంటలకు నష్టం జరిగింది. కంగ్టి, నాదలిగిద్ద, మనూర్, నారాయణఖేడ్, రాయికోడ్, ఝరాసంగం, జహీరాబాద్ మండలంతో పాటు ఇతర మండలాలలో వర్షంతో పాటు గాలి వాన, వడగండ్ల వర్షం కురవడంతో పంటలకు భారీగానే నష్టం జరిగింది. ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పంటలను వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వడగండ్ల వర్షంతో చేతికి వచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.