- 2017లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘ఫేజ్-1’ షురూ
- ప్రస్తుతం మూడు కారిడార్లలో సేవలు
- రోజుకు ఐదు లక్షలమందికి పైగా ప్రయాణం
- త్వరలో ఫేజ్-2 పనులు ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27(విజయక్రాంతి): ఆరంభంలో ఎన్నో వివాదాలు, అభ్యంతరాలతో ఆరంభమైన తొలి దశ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ఇప్పుడు లక్షలాది మంది ప్రయాణికుల ఆదరణను చూరగొన్నది. మెట్రో రైలు సేవలకు నేటి(గురువారం)తో అక్షరాల ఏడేళ్లు పూర్తవుతున్నది.
2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రవాణా సేవలు షురువయ్యాయి. తొలి రైలు మియాపూర్ నాగోల్ రూట్‌లో ప్రయాణించింది. తర్వాత హెచ్‌ఎంఆర్‌ఎల్ దశల వారీగా రెడ్, బ్లూ, గ్రీన్ కారిడార్లకు విస్తరించింది. ప్రస్తుతం 69 కి.మీ మేర ప్రతినిత్యం 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
ఇప్పటివరకు సుమారు 63.50 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించారు. అత్యధికంగా ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన 5.63 లక్షల మంది ప్రయాణించడం గమనార్హం. రాబోయే రోజుల్లో మూడు రూట్లలోని ప్రయాణికులు 7.9 లక్షల మందికి పెరిగే ఛాన్స్ ఉన్నట్లు మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు మొత్తం 57 మెట్రోస్టేషన్ల ద్వారా 57 రైళ్లు 1,025 టిప్పులు నడుస్తున్నాయి.
అంతాకలిపి 25 వేల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దేశంలోని మెట్రో రైలు సర్వీస్‌ల్లో నిన్నమొన్నటి వరకు 2వ స్థానంలో ఉన్న హెచ్‌ఎంఆర్‌ఎల్,0 ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. మెట్రో ఫేజ్ 2లో రాష్ట్ర ప్రభుత్వం మరో 116.4 కి.మీ మేర మెట్రో కారిడార్ల విస్తరణకు పూనుకున్నది. ఇది పూర్తయితే ప్రయాణికులకు మరిన్ని సేవలు అందనున్నాయి.
మెట్రోకు పెరుగుతున్న క్రేజ్
మెట్రో ఆరంభం నుంచి క్రేజ్ పెరుగుతోంది. ఆరంభంలో వద్దని వారించిన వారు ఇప్పుడందరూ మెట్రో కావాలని కోరుతున్నారు. నగర నలుమూలల నుంచి తమ ప్రాంతానికీ మెట్రో సేవలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సేవలను ఎక్కువగా ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఏ కాలమైనా ఎండ, వాన, చలి వంటి ఇబ్బందులు లేకపోవడంతో రోజురోజుకూ మెట్రోకు ఆదరణ పెరుగుతోంది.
2023 నుంచి మెట్రో రూ.59కి హాలిడే కార్డు (ఆదివారం, ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో)తో నగరంలోని మెట్రో రూట్‌లో ఎక్కడికైనా, రోజంతా హాయిగా తిరిగే అవకాశం కల్పించింది. మెట్రో స్టూడెంట్ పాస్‌తో 20 ట్రిప్పులకు రీఛార్జి చేసుకుని మరో 10 ట్రిప్పులను అదనంగా పొందే అవకాశం కల్పించింది.
పర్యావరణ హిత మెట్రో
హైదరాబాద్ మెట్రో వ్యవస్థ పూర్తిగా పర్యావరణ హితమైంది. మెట్రో ప్రయాణంతో ఈ ఏడాది దాదాపు 90,058.06 టన్నుల కర్బన ఉద్ఘారాలు తగ్గాయి. దాదాపు 58.8 కిలో లీటర్ల వర్షపు నీటిని భూగర్భంలోకి వెళ్లింది. అందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ సంస్థలకు పలు అవార్డులు సైతం వచ్చాయి. మరోవైపు వ్యవస్థ పరిధిలో సోలార్ పవార్ ఉత్పత్తి అవుతోంది.
మెట్రో రైలుకు బ్రేకు పడిన ప్రతిసారి కొంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే వ్యవస్థ మనుగడలో ఉంది. మొత్తం మెట్ర 57 మెట్రో స్టేషన్లకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), ఎగ్జిస్టింగ్ మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (జీఎంఆర్‌టీఎస్) వంటి అవార్డులను ఎల్‌అండ్‌టీ మెట్రో సాధించింది. గతంలో ‘బెస్ట్ వర్క్ టు ప్లేస్’ అనే అవార్డును సైతం సొంతం చేసుకుంది.
ప్రపంచంలోనే సక్సెస్‌ఫుల్ పీపీపీ.
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ)లో విజయవంతంగా నడుస్తున్న ప్రపంచంలోనే మొదటి మెట్రో ఎల్‌అండ్‌టీహెచ్‌ఎంఆర్‌ఎల్ కావడం గమనార్హం. దీంట్లో 81 శాతం పెట్టుబడులు ఎల్‌అండ్‌టీ సంస్థవి. కాగా బ్యాంకాక్‌లో 30 కి.మీ, ఢిల్లీలో 20 కి.మీ, ముంబైలో 13 కి.మీ ప్రైవేటు సంస్థలతో ప్రారంభమై ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి.
81శాతం ఎల్‌అండ్‌టీ పెట్టుబడులతో చేపట్టిన మెట్రోకు రూ.6 వేల కోట్ల నష్టాల్లో ఉంది. కొంతకాలం నుంచి ప్రతి త్రైమాసికంలో ఈ నష్టాలు కొంత మేరకు తగ్గుతున్నట్లు మెట్రో అధికార వర్గాలు తెలిపాయి.
స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో కేస్ స్టడీగా మన మెట్రో
హైదరాబాద్ మెట్రోకు ఏడేండ్లు పూర్తి కావడం ఆనందాన్నిచ్చింది. నాడు మెట్రో వద్దని దిష్టిబొమ్మలు కాల్చిన వారే ఇపుడు కావాలంటున్నారు. పీపీపీ విధానంలో చేపట్టిన ప్రపంచంలోనే సక్సెస్‌ఫుల్ మెట్రో ప్రాజెక్టు ఇది. ఫస్ట్ ఫేజ్‌లో 81శాతం ఎల్‌అండ్‌టీదే పెట్టుబడి. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా ఉంది. మిగతా మెట్రోల కంటే తక్కువ ఖర్చుతో మెట్రో ఫేజ్2 పనులు చేపట్టబోతున్నాం.
ఎన్వీఎస్ రెడ్డి, ఎండీ, హెచ్‌ఎంఆర్‌ఎల్